Friday, 28 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 234 వ భాగం



"ద్రుతమేవ విధేహి కృపాం సహజాం"

"భవశంకర దేశిక మే శరణం" అని కాళ్ళమీద పడ్డాడు. శిష్యులందరూ ఈ దృశ్యాన్ని చూసి ఆనందాశ్చర్యాలను ప్రకటించి యుంటారు, ఆనందాశ్రువులను రాల్చి యుంటారు. ఎందుకంటే ఇవి ఇతని పట్ల దయతో కూడినవి. ఇన్నాళ్ళూ ఇతణ్ణి మూర్ఖుడని భావించాం. ఎంత పొరపాటు జరిగిందని బాధపడి యుంటారు. ఇతడు "ప్రతిసార సముద్ధరణం" అనే గ్రంథాన్ని వ్రాసాడని అంటారు. అదీ తోటక ఛందస్సుతో ఉంటుంది. ఇతణ్ణి జ్యోతిర్మఠానికి అధిపతిని చేసారు.


మరో ఇద్దరు శిష్యులు


వీరికి పై నల్గురే కాకుండా ఇంకా శిష్యరత్నాలున్నారు. అందిద్దర్ని పేర్కొంటాను. వారూ సురేశ్వరుని మాదిరిగానే వాదించి ఓడింపబడ్డవారే. తరువాత శిష్యులైనారు. అందొకరు శంకరుల కంటే పెద్ద కూడా. అతని పేరు పృథ్వీధరుడు. మరొకడు శంకరులకంటే చిన్నవాడు, సర్వజ్ఞాత్ముడు.


కంచిలో పీఠాన్ని ఆరోహించిన వెనుక చాలామంది శంకరులతో వాదాలు చేసారు. తామ్రపర్ణీనదీతీరం నుండి ఒక తండ్రి, ఏడేళ్ళ కొడుకు వచ్చారు. ఆ పిల్లవాని పేరు మహాదేవుడు. ఇతని తండ్రి పెద్ద మీమాంసకుడు. ఆయన బౌద్ధ జైనులతో వాదించినపుడు ఈ పిల్లవాడూ పాల్గొంటూ ఉండేవాడు. తండ్రి, శంకరులతో వాదించి ఓడిపోయినపుడు ఈ పిల్లవాడు నాల్గు రోజులపాటు శంకరులతో వాదించి చివరగా ఓడిపోయాడు.


వీరిచే ఓడింపబడ్డానని కుఱ్ఱవాడు కలత పడలేదు సరికదా, వీరిపట్ల భక్తితో ఉన్నాడు. సన్న్యాస దీక్ష నిమ్మని అడుగగా శంకరులు ఇచ్చారు.


No comments:

Post a Comment