Tuesday, 18 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 225 వ భాగం



శృంగేరి యొక్క గొప్పదనం


ప్రయాణం సాగిస్తూ తుంగభద్రా నదీతీరంలోని శృంగేరికి చేరుకున్నారు. అక్కడ ప్రసవించే కప్ప పై ఎండ తగలకుండా ఉండడం కోసం పాము పడగనెత్తిన దృశ్యాన్ని చూసారు. పాముకి, కప్పకు సహజ వైరం. కాని ఇక్కడ రక్షిస్తోందేమిటి? ఇది పరమసాత్వికమైన, మహనీయమైన స్థలమని భావించారు. ఇంతలో అందెల చప్పుడు వినబడడం లేదు. శంకరులు వెనుదిరిగి చూసారు.


అక్కడ ఇసుక తిన్నెలలో సరస్వతి పాదాలు చిక్కుకోవడంచే అందెల చప్పుడు వినబడలేదు. ఏది జరిగినా మన మంచికోసమే అంటూ అక్కడే శారదా పీఠాన్ని స్థాపించారు.


వారక్కడ చాలాకాలముండి అమ్మవారిని అర్చించారు. మొదటి 16 సంవత్సరాల వయస్సులో గ్రంథాలన్నిటినీ వ్రాసేరు. మిగిలిన 16 సంవత్సరాలలో దేశాన్ని ముమ్మారు పర్యటించి అనేక ఘన కార్యాలు చేసారు. చాలాకాలం శృంగేరిలోనున్నట్లు శంకర విజయం చెబుతోంది.


శృంగేరీ మఠ ప్రత్యేకత


మిగిలిన మఠాలు, తామెక్కడ స్థాపించాలో ఊహించి ఏర్పాటు చేయబడినవి. భారతదేశంలో నాల్గు మూలలా నాల్గు క్షేత్రాలున్నాయి. వీటిని 'చార్ధామ్' అంటారు. ఉత్తరంలో బద్రీనాథ్, పడమర తీరాన ద్వారకానాథం (సోమనాథం); తూర్పున పూరీలో జగన్నాథం, దక్షిణాన రామనాథం (రామేశ్వరం) వీటిల్లో బదరి, ద్వారక, పూరీ క్షేత్రాలలో మూడు ప్రధాన మఠాలను స్థాపించారు.


No comments:

Post a Comment