Wednesday 5 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 212 వ భాగం



ఇతర దేశాలలో మన వంటి వర్ణ విభజన లేకపోవచ్చు. అయితే వారిలో ఐకమత్యం ఉందని చెప్పగలరా? సమానత్వం పేరు పెట్టినదగ్గరనుండి పరస్పర కలహాలు వస్తున్నాయి. సమానత్వం పేరుతో ఉద్యమాలున్నా పోటీ మనస్తత్వం ప్రబలిపోయి సంఘర్షణలకు దారితీస్తోంది.


వర్ణ విభజన యొక్క మౌలిక తత్త్వం పోయి గందరగోళ పరిస్థితులేర్పడినపుడు మరల దానిని శంకరులు పునరుద్ధరించారు. వాటి గోడలను బ్రద్దలు కొట్టాలని అనలేదు. ఈ మాటలు చెబితే ఇవి మీకు రుచింపకపోవచ్చు. బుద్ధుడు, గాంధీ మాదిరిగా చెబితే వారికీ బహుళ ప్రచారం లభించి యుండేది. అబ్బి పొగడ్తలను, ప్రచారాన్ని వారాశించలేదు.


శంకరులు చెప్పినదేమిటి? జ్ఞానావస్థలో ఉన్నవారికి అంతా సమానంగా కన్పిస్తుందని అన్నారు. జ్ఞానికి జాతి లేదు, ఎక్కువ తక్కువలు లేవు. తల్లి, తల్లి కాదు, తండ్రి తండ్రి కాదని చివరి దశలో నున్నవానికి వేదం చెప్పింది. ఫలానా కోరిక లేనివానికి దేనిని పడితే దానిని తినవచ్చని చెప్పింది. ఆ జ్ఞాని స్థితి ఎక్కడ? మనమెక్కడ? నూటికి 99 పాళ్ళు, అందరూ రాగద్వేషాలతో కూడి యున్నవారే. 


అందరి కార్యక్రమాలూ ఒకటని గీత చెప్పలేదు. నీవు క్షత్రియుడివి, నీ ధర్మం నీవు నిర్వర్తించమని ఎందుకన్నాడు? జాతి భేదం లేకపోతే ఇట్లా అంటాడా? మనం, ద్వంద్వ ప్రపంచంలో ఉన్నాం. ఇది నడవాలంటే ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించవలసిందే. అద్వైతానుభవాన్ని నిత్య వ్యవహారంలో చూపిస్తే ఎలా?


తామనుకొన్నవి శాస్త్రాలలో ఉన్నాయని, ఆధునికులు నిర్ణయానికి వస్తారు. ఏ సందర్భంలో అవి చెప్పబడ్డాయో అని విచారణ చేయరు.


ఆ పంచముడు, మామూలు వాడైతే శంకరులు ఇట్లా సమాధానం చెప్పి యుండేవారు. "నీవన్నట్లు రెండు శరీరాలు రక్త మాంసమయములే. లోనున్న చైతన్యమూ ఒక్కటే. అయితే లోనున్న దానిని చూడగలుగుతున్నావా? చూడలేవు. ఎందుకు చూడలేవు? గత జన్మ సంస్కారాలు చూడలేకుండా చేస్తున్నాయి. సంస్కారాలకనుగుణంగా జన్మనెత్తుతున్నావు. వచ్చిన జన్మకు అనుగుణంగా ప్రవర్తించి పాపాలను పోగొట్టుకో. నీవు చూడలేనట్లే అందరూ చూడలేకపోతున్నారు. వారి వారి కర్మలను చేస్తూ చిత్త శుద్ధిని పొందగలిగితే చూస్తారు. మానసికంగా అందరూ ఒక్కటే అని భావించాలి గాని, భౌతిక వ్యవహారాలలో భేదాలు తప్పవు. సంఘం సరిగా సాగాలంటే భిన్న భిన్న కార్యకలాపాలలో ఎవరి పాత్రను వారు నిర్వహించవలసిందే. అందరి శరీరాలలోనూ చైతన్యం ఒకటైనా సంఘం యొక్క మంచి కోసం మంత్రానుష్టానం చేయాలంటే మిగిలిన వారికంటే బ్రాహ్మణులు తప్పక ఆచారాలు పాటించ వలసినదే. అట్టివారు దూరంగా ఉన్నా తప్పు లేదు, మనస్సు నణిగినవాని దృష్టిలో మాత్రం అంతా ఒకటంటే చెల్లుతుంది.


No comments:

Post a Comment