Monday, 24 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 230 వ భాగం



ఆ పిల్లవాడితో నీ పేరేమిటని ఎక్కడ ఉంటున్నావని అడిగారు శంకరులు. సంవత్సరాలు తరబడి నోరు విప్పనివాడు, "అంతా ఒక్కటైనపుడు ఎవరని చెప్పను? అంతా కలయై యుండగా ఒక ప్రదేశాన్ని ఎట్లా పేర్కొనగలను? కలనుండి మెలకువ వచ్చిన తరువాత కలలో చూసిన ఏ ప్రదేశాన్ని పేర్కొనాలి? అంటూ ఒక శ్లోకరూపంలో "నేను మానవుడుగాను, యక్షుణ్ణిగాను, నాల్గు వర్ణాలలో దేనికీ చెందను. నాల్గు ఆశ్రమాలలో చేరను. నేను నిజబోధ రూపుణ్ణి అనగా ఆత్మజ్ఞాన స్వరూపాన్ని" అని సమాధానం ఇచ్చాడు.


తండ్రి, తన పిల్లవాడు మాట్లాడుతున్నాడని సంతోషించి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటి దగ్గర మళ్ళీ మాట్లాడడం మానేసి ఉన్నాడు. మరల పూర్వధోరణిలో ఇతడుండడాన్ని గమనించి అయ్యా! ఇతడు నా కొడుకు కాదు, మీవాడే అని శంకరులకు అప్పగించాడు. ఇతనికి హస్తామలకుడని శంకరులు నామ కరణం చేశారు.


ఏదైనా పెద్ద పండును చేతిలో పెడితే దాని సమగ్ర స్వరూపం కనబడకపోవచ్చు గాని, ఒక ఉసిరికను పెడితే స్పష్టంగా దాని సమగ్ర స్వరూపాన్ని చూడగలం. గుండ్రంగా ఉంటుంది. నిమ్మకాయ కంటె స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్టంగా, సమగ్రంగా తెలిసికొన్నదానిని హస్తామలకంలా ఉంది అని అంటాం. ఆత్మ స్వరూపాన్ని సమగ్రంగా అర్థం చేసుకొన్నవాడని ఆ పేరు పెట్టారు. ఇతడి శ్లోకాలపై గురువులే భాష్యం వ్రాసేరు.


పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్న మఠంలో పీఠాధిపతిగా ఉంచారు. ద్వారకలో ఉంచారని కొందరి అభిప్రాయం.


No comments:

Post a Comment