ఆ అద్వైత జ్ఞానం వచ్చే వరకూ భక్తితో ఉండాలని, ప్రేమ కలిగియుండాలని చివరకు ఇద్దరూ (జీవాత్మ పరమాత్మలు) ఒక్కటే అనే జ్ఞానం వస్తుందని వీరంటారు. మీమాంసలో ప్రేమతో కూడిన భక్తి లేకపోవడం ఒక లోపం. శరీరంతో పనులు చేస్తూ ప్రేమతో కూడిన మనస్సుంటే, చివరకు ఆ మనస్సే మటుమాయమై శాంతంతో కూడినపుడు ఆత్మ సాక్షాత్కారమని ఇట్లా సమగ్ర ప్రణాళికను అందించింది వేదాంతం. అదేమీ లేకుండా వట్టి కర్మలు చేసి ఏం ప్రయోజనం? జీవునకు పరిపూర్ణ తృప్తి ఎట్లా వస్తుంది?
కర్మ భక్తులతో స్వామిని ఆరాధించాలి. ఈ ప్రపంచాన్ని అతని స్వరూపంగా భావించాలి. సంఘానికి మేలు చేయాలి. ఇదంతా ఇతరుల కోసం చేస్తున్నామనే భావన పోయి ఆత్మోద్ధరణకై చేస్తున్నామనే భావన రావాలి. ఆ స్థితిలో నిష్క్రియత్వం. ఇది అభ్యాసం వల్ల గాని పట్టుబడదు. ఎంతవరకూ శరీరం, మనస్సు ఉందో అంతవరకూ జనన మరణాలు తప్పవు, ఆకారం, భావం లేనపుడు కర్మ ఏమిటి? ఫలాలేమిటి? సంసారంతో సంబంధమేమిటనే స్థితి ఏర్పడుతుంది. శాశ్వత సుఖం, మన లక్ష్యమని భావించవద్దా? కర్మలతో నిరంతరం మునిగిపోవడం చిత్తాందోళనలతో జీవితాన్ని చివరి కంటా గడపడమా? అని వేదాంతులు ప్రశ్నిస్తారు.
"మాతే సంగోస్తు అకర్మణీ" (2-47) అనగా కర్మలను చేయకపోవడంతో అనగా కర్మత్యాగంలో పట్టుదల వద్దు. ఇది ప్రాథమిక దశలో నున్న సాధకుణ్ణి ఉద్దేశించింది. అతడు పుట్టినప్పటి నుండి గిట్టేవరకూ భౌతిక సుఖాల కోసం చేస్తూనే ఉంటాడు. అట్టివానిని వెంటనే కర్మలు వద్దని చెబితే సాధ్యమా?
నేనన్నీ మానేస్తాను. జ్ఞానినౌతానంటే అది సాధ్యం కాదు. దానికి తగినంత బలం లేదు. ఎంతవరకూ దేహంతో సంబంధం ఉంటుందో అంతవరకూ పని చేయకుండా ఉండలేరని చెప్పింది గీత "నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణి అశేషతః" (18-11) శరీరం పనిచేస్తూ ఉండకపోయినా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. కనుక ఇంద్రియాలకు సుఖం ఉంటుంది. ఆ మనస్సు అణగలేదు. పైకి మాత్రం జ్ఞానిలా ఉంటూ లోలోపల మనస్సు, ఇంద్రియాల వెంట తిరుగుతూ ఉంటే ఇంతకంటె కపటి మరొకడు ఉంటాడా? అని గీత ప్రశ్నించింది.
No comments:
Post a Comment