Tuesday, 4 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 211 వ భాగం



ఇంద్రునికు అట్టి అనుభూతి లేదు. రెండవ వాక్యంలో జ్ఞానిని మునిగా పేర్కొన్నారు. ఇంద్రుని ఆనందాన్ని ముందుగా, జ్ఞాని ఆనందాన్ని తరువాత పేర్కొన్నారు. ఇంద్రాది దేవతలు బుద్ధితో ఆనందాన్ని అనుభవిస్తే జ్ఞాని యొక్క బుద్ధి, శాశ్వతానందంలో మునిగిపోయి ఉంటుంది. బుద్ధి లీనమై పోతుంది.


ఎంతవరకూ, ఇంకొకదానిని తెలిసికొంటుందో, తెలిసికొనేది వేరు, తెలియబడేది వేరనే విభజన ఉందనే యుంటుంది. ఇది ద్వైతం. బుద్ధి లేకపోతే దేనితో తెలిసికోవడం? బుద్ధి కనుమరుగైతే ఉండేది ఆత్మయే కదా! దానికి రెండంటూ లేదు. కనుక బ్రహ్మవిత్ అవుతాడు. బ్రహ్మవిత్ కూడా కాదు బ్రహ్మమే అవుతాడు.


"బ్రహ్మైవ న బ్రహ్మవిత్"


అట్టి బ్రహ్మ స్వరూపమే నా గురువని శంకరులన్నారు. అట్టివానికి బ్రహ్మ కూడా శిష్యుడై యుంటాడని అన్నారు. అట్టివారిని జాతి, వర్గ, స్థాయి, వయస్సులనే కొలబద్దలతో లెక్కపెట్టరాదని సిద్ధాంతం.


సమదృష్టి వేరు, సాంఘిక సమానత్వం వేరు


ఈ సంఘటనకు ఆధునిక సంస్కర్తలు మరొక విధంగా అర్ధం చెబుతారు. శంకరులు వర్ణాశ్రమ విభజన వద్దు అన్నారని అర్ధం తీస్తారు. వారి రచనలను చదవితే వీరు చెప్పినది తప్పనిపిస్తుంది. ఈ సంస్కర్తలకు వర్ణాశ్రమ విభజన తప్పనిపిస్తే వారు చెప్పవచ్చు గాని ఈ కథతో ముడిపెట్టడం అన్యాయం. పూర్వులు దేనిని సమత్వమన్నారు? అందరిపట్ల ఎక్కువ తక్కువలు చూడకుండా ప్రేమను పంచి పెట్టాలన్నారు. వర్ణాశ్రమాలు వద్దని, వివిధ ప్రజలు వివిధ వృత్తులను చేసుకోనవసరం లేదని చెప్పలేదు. మామూలు నడవడికలోనే భేదాలను పాటిస్తాం. వండే పదార్థాన్ని కార్య క్రమానికి అనుగుణంగా తీర్చి దిద్దుతారు. జ్వరంతో బాధపడే వానికి వేడినీళ్ళు ఇయ్యాలి. అన్నాశయ సంబంధమైన రోగంతో బాధపడేవానికి చన్నీళ్ళు ఇయ్యాలి. పూజకు విడిగా నీరు, అసలు పప్పు ఉడకడానికే ప్రత్యేకమైన నీటిని వాడతారు. స్నానానికి, బట్టలుతకడానికి నీరు వేరుగా ఉంటుంది. ఇట్లా ప్రతి వ్యవహారంలోనూ విభజనను పాటిస్తాం.

No comments:

Post a Comment