Saturday 29 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 235 వ భాగం



శంకరులు సిద్ధి పొందడానికి ముందుగా సురేశ్వరుల పర్యవేక్షణలో ఇతడు కంచి మఠాన్ని అధిరోహించాడు. అందువల్ల సురేశ్వరులను గురువుగా భావించి ఆయనను 'దేవేశ్వరుడని' ఇతడు కీర్తించాడు. 


ఈయన సన్యాసనామం సర్వజ్ఞాత్ముడు ఇతడు సంక్షేప శారీరకాన్ని వ్రాసేడు. ఇది శంకరుల శారీరక భాష్యాన్ని ఆధారంగా చేసుకుని వ్రాసినది. పేరులో సంక్షేపం (చిన్నది) అని యున్నా వేయి శ్లోకాలతో ఉంటుంది. శ్లోక రూపంలో అద్వైతం గురించి చాలా తక్కువ పుస్తకాలున్నాయి. ఇతడేకాదు, విద్యారణ్య స్వామివారొక అద్వైత గ్రంథాన్ని వ్రాసారు.


పంచ ప్రక్రియయనే అద్వైత గ్రంథాన్ని కూడా రచించాడు. మీమాంసపై ప్రమాణ లక్షణాన్ని వ్రాసేడు. వ్యాస పూజలో ఇతణ్ణి కొలుస్తారు. వ్యాస పూజలో 30 మంది ఆచార్యులను కొలుస్తారు. అవి ఆరు పంచకాలుగా ఉంటాయి. ద్రవిడ పంచకంలో ఇతని పేరుంటుంది. ఈయనను సంక్షేప శారీరకాచార్యుడని సర్వజ్ఞాత్మముని అని కూడా కొలుస్తారు.


పృథ్వీధరాచార్యుడు, శంకరుల కంటే పెద్ద. శంకరుల ముందే చాలామంది సూత్రభాష్యాలు వ్రాసేరు. అవి అద్వైతానికి భిన్నంగా ఉంటాయి. ఈయన వ్రాసిన భాష్యానికి పృధ్వీధర భాష్యమంటారు. పృధ్వీధరుని భాష్యం, అభినవగుప్తుని భాష్యంతో కలిపి 99 మంది భాష్యాలను ఆచార్యులు ఖండించారని తత్త్వ చంద్రికలో ఉంది. ఇందు పృథ్వీధరుణ్ణి పేర్కొనడం వల్ల ఈయన ఉన్నతస్థానం తెలుస్తోంది. తంత్రాలోకం, అలంకారశాస్త్ర వ్యాఖ్యానం వ్రాసిన అభినవగుప్తుడు గీతాభాష్యాన్ని కూడా వ్రాసాడు.


పృథ్వీధరుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు. శిష్యుడయ్యాడు.


No comments:

Post a Comment