Monday 17 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 224 వ భాగం



తన భర్త ఓడిపోయాడని ప్రత్యక్షంగా చెప్పకుండా ఇద్దరూ నా భిక్షను స్వీకరించండని గడుసుగా చెప్పింది. ఇద్దరికీ నమస్కరించింది.


భోజనానికి రండని గృహస్థు ఇతరులను పిలవకూడదు. వైశ్వదేవానికో, లేదా దేవతార్చనకో దయ చేయండని అనాలి. మండనుడు ఓడినట్లు సున్నితంగా చెప్పినట్లైంది.


ఏ భార్యయైన తన భర్త, సన్న్యాసం పుచ్చుకుంటున్నాడంటే సహించగలదా? కాని సరసవాణి, ఇంత వరకు యజ్ఞ పత్నిగా ఉంది. ఆమెకు అలౌకిక శక్తి యుంది. కనుకనే 21 రోజులు, పూలమాల వాడిపోకుండా ఉండగలిగి ఉంది. ఆమె ఉభయ భారతిగా ఇప్పుడు ప్రసిద్ధిని పొందింది. ఆమె సరస్వతి యొక్క అవతారమే కదా!


మండనుడు సన్న్యాసం స్వీకరించి సురేశ్వరాచార్యులైనారు. బ్రహ్మలోకానికి, తిరిగి సరసవాణి వెళ్ళాలనుకుంది.


ఇట్లా వెళ్ళిపోతే ఎలా అమ్మా! నీవిక్కడే ఉండి అందరికీ జ్ఞానాన్ని, బుద్ధిని కలిగించాలని నవదుర్గా మంత్రంలో ఆమెను శంకరులు బంధించారు. ఆ మంత్రానికి లొంగినట్లు కనబడింది. అట్లా భక్తి ప్రేమ పాశాలతో శంకరులామెను బంధించగలిగారు.


అయితే నన్నిక్కడ ప్రతిష్ఠించవద్దని, నీవు దేశం తిరుగుతూ ఉండమని, వెనుదిరిగి చూడవద్దని చూస్తే అక్కడే ఉండిపోతానని ఆమె అనడం, శారదా పీఠాన్ని శంకరులేర్పాటు చేయడం మొదలైన కథ మనకు తెలిసిందే అయినా చెబుతున్నాను. వెను దిరిగి చూడకుండా నడుస్తున్నారు. ఆమె అందెల గలగల, వినబడుతూనే ఉంది.


No comments:

Post a Comment