Thursday, 13 October 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 220 వ భాగం



మండన మిశ్రుల ప్రాంతం- పండితుల నిలయం


కర్మ మార్గంలో బద్ధులైన వారిని ఉద్దరించడం కోసం, దయతో వారితో వాదించడం కోసం శంకరులు బయలుదేరారు. మాహిష్మతీ నగరంలో మండనమిత్రుల ఇంటిని వెదుకుతూ ఉండగా కొంతమంది స్త్రీలు నీళ్ళ బిందెలతో కనబడ్డారు. మండనుల ఇల్లు ఎక్కడ? అనగా వారు శ్లోకరూపంలో సమాధానం ఇచ్చారు:


"స్వతః ప్రమాణం పరతః ప్రమాణం

కీరాంగనా యత్ర గిరం గిరంతి

ద్వారస్థ నీడాంతర సంనిరుద్దా

జానీ హి తన్మండన పండి తౌకః" 


అనగా ఏ ఇంటి ద్వారంలో పంజరాలలో నున్న చిలుకలు, వేదం స్వతః ప్రమాణమా? పరతః ప్రమాణమా అని వాదిస్తూ ఉంటాయో అదే వారిల్లని సమాధానం చెప్పారు. చూసారా? న్యాయ మీమాంసపరిచయం స్త్రీలకు, తుదకు పక్షులకు కూడా ఆనాడుండేదని తెలియడం లేదా? 


ఇది ఆనంద గిరియంలో ఉన్న శ్లోకం. స్వతః ప్రామాణ్యవాదం, పరతః ప్రామాణ్యవాదం అని ప్రామాణ్య వాదం రెండు రకాలుగా ఉంటుంది.


ఒక వస్తువును చూస్తే మనకు కలిగిన జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సరియైనదని, రెండవది కాదని తెలుస్తుంది. ఒక తగరపు చిప్పపై సూర్యకాంతి పడిందనుకోండి. అది వెండిలా కనిపిస్తుంది. కాని అది తగరపు చిప్పయని తెలుసు. మన బుద్ధి, ముందు వెండిదని చెప్పినా అట్టి బుద్ధి ప్రమాణం కాదని తెలుస్తుంది. వెండి పాత్ర, వెండి పాత్రయే. తగరపు చిప్ప, తగరపు చిప్పయే అని తెలిసి కొనుట ప్రమాణమవుతుంది.


No comments:

Post a Comment