క్షేత్ర, క్షేత్రజ్ఞ విలువలను గుర్తించు, ద్వంద్వ ప్రవృత్తిని జయించు. ఏకాంతవాసంతో, యోగాభ్యాసంతో అంతరేంద్రియాలను నిగ్రహించు. భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరం జాగరూకుడవై యోగమార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం చెందుతుంది, భవరోగాలన్నింటికీ అదే దివ్య ఔషధం. జనన మరణాల చక్రము నుండి బయటపడే సాధనం ఇదే, మరొకటి లేదు. యోగమార్గాన ప్రయాణం చేయడమే శరణ్యం. ఈ క్షణములోనే నీవు ధృడంగా సంకల్పించుకో.
నాయనా ! కళ్ళు తెరిపించావు. ఈ సంసారము నుండి బయటపడాలి. బయటపడాలి అనుకోవడమే తప్ప బయటపడే మార్గం తెలియక ధైర్యంచాలక కొట్టుకుంటున్నాను. దారి చూపించావు. ధైర్యం కలిగించావు. జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే యోగవిద్య నాకు ఉపదేశించు. భవదావాగ్నిలో మాడిపోతున్న నా అంతరంగానికి బ్రహ్మ జ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు. అవిద్య కృష్ణసర్పం కాటువేసి మూర్చపోయిన నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడేయి. ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధనధాన్యాలు ఇలా వేయి పాశాలు ముడివేసుకొని గిలగిలా కొట్టుకుంటున్నాను. యోగవిద్య అనే ఖడ్గంతో నా బంధనాలు చేదించి స్వేచ్ఛ ప్రసాదించు.
తండ్రీ! యోగాభ్యాసానికి కావలసిన పరిణతి నీకులభించింది. తప్పకుండా ఉపదేశిస్తాను. వెనుక దత్తయోగీంద్రుడు అలర్కుడికి చెప్పిన యోగవిద్య నీకు చెప్తాను, శ్రద్ధగా విను. నాయనా కుమారా నువ్వు బోధించే యోగవిద్యలో ఈ అంశాలు వస్తాయో రావో, మళ్ళీ చివరలో ఈ సందేహాలు గుర్తుంటాయో ఉండవో అందుకని ముందే అడుగుతున్నాను. దత్తయోగీంద్రుడు ఎవరు? అలర్కుడు అంటున్నావు. ఆయన ఎవరు? వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి ఆపైన యోగవిద్య చెబుదువుగాని. తండ్రీ అడగవలసిందే అడిగావు. వీరిద్దరి గురించి చెప్పకుండా యోగవిద్య ఎలా చెప్పగలను. ముందుగా దత్త యోగీంద్రుని ఆవిర్భావానికి హేతువయిన పావన గాధ చెబుతాను విను.