Monday 9 January 2023

శ్రీదత్త పురాణము (14)



ఒకరోజు తెల్లవారుఝామున దీపకుడు గంగానదికి వెళ్ళి తాను స్నానం చేసి యధావిధిగా గురువువారి శరీరాన్ని శుభ్రం చేయడానికి అవసరమైన గంగాజలాన్ని కడవకెత్తుకుని గురువుగారు లేచారేమోననుకొని వడివడిగా కుటీరంలోకి వస్తున్నాడు. ఇంతలో కుటీరానికి చేరువలో దీపకుని ఎదుట కాశీవిశ్వనాధుడు దర్శనమిచ్చాడు. నువ్వుచేస్తున్న గురుసేవకు ధర్మనిష్టకూ సంతసించాను ఏదైనా వరం కోరుకో అన్నాడు విశ్వనాధుడు. దీపకుడు సంభ్రమాశ్చర్యములతో సాష్టాంగపడి విశ్వనాధుని సేవించి స్తుతించాడు. బ్రహ్మర్షులకు కూడా దక్కని నీ దర్శన భాగ్యం దక్కింది, నాకు వరంకూడా ఇస్తానంటున్నావు. ఆనందపారవశ్యంలో వున్నాను. ఏమని అడగాలో కూడా తెలియడం లేదు. ఓ నిమిషం ఆగు కుటీరంలోకి వెళ్ళి గురువుగార్ని అడిగివస్తాను, అంటూ కుటీరంలోకి ప్రవేశించాడు. గురుదేవా ! శివుడు ప్రత్యక్షమైనాడు. వరం కూడా ఇస్తానంటున్నాడు. గురుశుశ్రూషకు సంతోషించాడట. మీరు అనుమతి ఇస్తే మీ కుష్టత్వము, అంధత్వము అన్నీ పోయేటట్లుగా వరం అడుగుతాను అడగమంటారా అన్నాడు. అప్పుడు వేదధర్ముడు గంభీర స్వరంతో నాయనా దీపకా శివుడంతటివాడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇంతకంటే అడగడానికి నీకు ఇంకేమీ దొరకలేదా ఐహిక విషయములా అడగవలసింది. పైగా నారోగం పాప ఫలం అనీ, అనుభవించడం తప్ప వేరొక గత్యంతరం లేదని ఎన్నోసార్లు చెప్పాను అన్నాడు. 


వేదధర్ముడి మాటల్లో విసుగుని గుర్తించాడు దీపకుడు. కుటీరం వెలుపలికివచ్చి శివునికి నమస్కరించి అష్టమూర్తి నీ వాత్సల్యానికి ధన్యవాదములు. నిన్నిప్పుడు అడగదగింది నాకు ఏదీ కనిపించడంలేదు క్షమించు అన్నాడు. అదేమిటి నాయనా అడగదగిందే కన్పించడం లేదా మీ గురువు ఆరోగ్యం సరిచేయమని కోరవచ్చు కదా! అంటూ శివుడు ప్రోత్సహించాడు. దానికి దీపకుడు నిరాకరించాడు. అలాంటివరం అడిగేందుకు గురువు అనుమతిలేదు. సెలవు ఇప్పించు గురువు గార్కి సేవజేసుకోవాలి అని రివ్వున కుటీరంలోకి వెళ్ళి గురుసేవలో నిమగ్నమయ్యాడు. శివుడు అంతర్దానం చెంది తన ఆస్థానమంటపంలో ఆ సాయంకాలం కొలువు తీరి వుండగా సకల దేవతల సమక్షంలో అందరూ వింటూవుండగా శ్రీమన్నారాయణునితో ఈ సంగతి చెప్పాడు. దీపకుడంటే దీపకుడే భవధ్వాంతనాశకుడు. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి చూడదగిన శిష్యుడు అని ప్రశంసించాడు.


శ్రీమన్నారాయణుడు ఆనందం పట్టలేక మరునాడే దీపకుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపకా నీ గురుసేవా పరాయణత్వం నన్ను ఆనందపరవశుల్ని చేసింది. నీ యిష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు.


దీపకుడు భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసాడు. అనేకానేక స్తోత్రములతో స్తుతించాడు. నారాయణా! వాసుదేవా! గురుసేవ అనేది హరిహరులను ఇద్దరినీ ఇంతగా ఆనందపరుస్తుందని తెలియదు. నా ధర్మంగానే నేను సేవజేస్తున్నాను. దిక్పాలకులకైనా అనుగ్రహించని దివ్య దర్శనం నాకు ప్రాప్తింపజేసారు. ఇది మీ కరుణకి సంకేతం. నాకు గురువే దైవం, జపము, తపము, తీర్థము, క్షేత్రము సర్వస్వమూ నాకు గురువే. వేదశాస్త్రాలు బోధించి, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి, పరతత్వాన్ని తెలియపరచిన వేదధర్ముడే నాకు ప్రత్యక్షదైవం. అనన్య చిత్తంతో గురుసేవ చేస్తున్నాను. దీనికి ఏదైనా ప్రతిఫలముంటే అది మోక్షమే తప్ప కోరదగింది ఏమీలేదు. అయినా కరుణామూర్తివై వచ్చి ఏదైనా కోరుకోమన్నావు కాబట్టి అడుగుతున్నాను. నాలో గురుభక్తి స్థిరమయ్యేట్టు అనుగ్రహం ప్రసాదించు. నాకు తెలియని గురుమహిను ఏమైనా ఉంటే చెప్పు. ఇదే నిన్ను కోరే వరం.


No comments:

Post a Comment