Sunday 8 January 2023

శ్రీదత్త పురాణము (13)



నాయనా దీపకా నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు కనుకనే నేను నిన్ను అడిగాను. కాని కాశిలో పాప ఫలాన్ని అనుసరించి నేను కుష్టు రోగపీడితున్ని కాబోతున్నాను. కుంటితనము, గ్రుడ్డితనము ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఇరువది ఒక్క సంవత్సరముల పాటు అనుభవించవలసినవి. ఇవన్నీ పూర్వజన్మ సంచితాలు. ఇన్ని సంవత్సరములు సేవ చెయ్యాలి అన్నాడు. అప్పుడు దీపకుడు గురూత్తమా ! తప్పకుండా చేస్తాను. కాని నాదొక సందేహం ఆ పాపాన్ని మీరే అనుభవించాలా?


నాకు సంక్రమింప జేయండి అది నేను అనుభవిస్తాను. మీరు నిరాటంకంగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. అప్పుడు వేదధర్ముడు నాయనా ఎవరి పాపాలు వారు అనుభవించవలసినదే. పాప ఫలాలు కర్తలకే చెందుతాయి తప్ప శిష్యునకో, పుత్రునికో, లేదా ఇంకొకరికో పులముదామని అనుకొంటే అంటుకోవు కనుక నా పాప ఫలాలు నేను అనుభవిస్తాను.


అనుభవిస్తున్న సమయంలో సేవ చేస్తే చాలు. కుష్టురోగికి సేవలు చేయడమంటే అది అనుభవించడంకన్నా కష్టం. దానికి నవ్వు అంగీకరించావు. పద వెంటనే కాశీకి చేరుకుందాం అని త్వరత్వరగా ఇద్దరూ మనోవేగంతో కాశి చేరుకున్నారు. గంగానదిలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసారు. డుండి గణపతిని కాలభైరవుణ్ని అర్చించారు. అన్నపూర్ణ విశాలాక్షి, విశ్వేశ్వరులను దర్శించారు. ఉత్తర దిక్కుగా ఒక కంబలాశ్వతరు సన్నిధిలో చిన్న కుటీరం నిర్మించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ముప్పొద్దులా గంగాస్నానం, విశ్వనాధుని దర్శనం, చేసుకున్న తరువాత ఒకరోజు తెల్లవారి లేచేసరికి వేదధర్ముడి శరీరం నిండా పొక్కులు వచ్చాయి. క్షణంలో కాళ్ళు చేతులు తిమ్మిరులెక్కాయి. పొక్కులు చితికి చీము, నెత్తురు కారసాగాయి. చూస్తూవుండగానే శరీరం అంతా పొడలుతో నిండిపోయింది. చూపు మందగించింది. కంఠస్వరం మారిపోయింది. వేళ్ళు వంకరలు తిరిగాయి. కుష్టు తనము, కుంటి తనము, గ్రుడ్డి తనము ఒక్కసారిగా వేదధర్ముణ్ని ముంచెత్తాయి. క్రమక్రమంగా రోగం బాగా ముదిరిపోయింది. నిలబడలేక పోతున్నాడు, కూర్చో లేకపోతున్నాడు, పడుకోలేకపోతున్నాడు. అసలు కదలలేని స్థితి వచ్చింది. అన్నీ మంచంలోనే. భరించలేని దుర్వాసన, దీనికి తోడు కాశీలోని ఈగలన్నీ అతన్ని చుట్టు ముట్టాయి. రోగ బాధతో వికృతంగా మారిపోయాడు. మెడలు వాల్చి ముఖం ఏటవాలుగా త్రిప్పి కనిపించని కన్నులతో దీపకా, దీపకా అని అరుస్తున్నాడు. దీపకుడు మాత్రం నిమిషం నీమారకుండా సకలసేవలూ చేస్తున్నాడు. పసి బిడ్డను కన్నతల్లిలా చూస్తున్నాడు. ఎంత దుర్గంధం అయినా ముఖం త్రిప్పుకోకుండా భరిస్తూ గురువుగారు వున్న ప్రదేశాన్ని ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ ఈగలను తోలుతూ సేవచేస్తున్నాడు. గురువుగార్కి కొద్దిగా కునుకుపట్టిన సమయంలో గబాగబా నాలుగిళ్ళు తిరిగి యాచించి ఆహారం తెస్తున్నాడు. ఆకలి ఎరిగి బతిమాలి తినిపిస్తున్నాడు. కుష్టురోగికి కోపమెక్కువ అన్నారు. వేదధర్ముడు నిష్కారణంగా దీపకుణ్ని తిట్టిపోస్తున్నాడు. ఈపాటి చెయ్యిలేనివాడివి ఎందుకొచ్చావని దెప్పిపొడుస్తున్నాడు. ఒకరకంగా కాదు, నానా దుర్భాషలు ఆడుతున్నాడు. మరుక్షణంలోనే మళ్ళీ సౌమ్యుడౌతున్నాడు. నాయనా దీపకా, తండ్రి దీపకా అని బుజ్జగిస్తున్నాడు. నిన్ను బాధపెడుతున్నానురా అని విలపిస్తున్నాడు. మళ్ళీ అంతలోనే అనరాని మాటలతో తిట్టిపోస్తున్నాడు. దీపకుడు మాత్రం అన్నింటికి ఓర్చుకుని చెరగని చిరునవ్వుతో, నిగ్రహంతో, సేవజేస్తున్నాడు. గురువులోనే విశ్వనాధున్ని, కాశీలోని దేవతలందర్ని గురువులోనే చూస్తూ సేవిస్తున్నాడు. తగినంత దొరక్క దొరికింది గురువుకీ సరిపోక పస్తులుంటూ సేవించుకొంటున్నాడు. ఏ నిమిషాన గురువు గారికి ఏ అవసరముంటుందోనని మంచం ప్రక్కనే వుండి రేయింబవళ్ళు మెలకువగా కూర్చుంటున్నాడు. కాశికి వచ్చింది మొదలు కంటినిండా నిద్రపోయిన రోజులేదు. కడుపునిండా తిన్న రోజులేదు. అయినా గురుసేవ చేస్తున్నావనే తృప్తి అతన్ని నిలబెడుతోంది. లభించబోయే ముక్తి అతన్ని నడిపిస్తోంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి.


No comments:

Post a Comment