Wednesday, 25 January 2023

శ్రీదత్త పురాణము (30)శరకారుడు : మీరందరూ ఉపయోగించే బాణాలను తయారుచేసే శరకారుడు నా ఇరవై ఒకటవ గురువు. అతడిని ఎప్పుడు నీవు గమనించి ఉండవు. బాణం తయారుచెయ్యడం చాలా క్లిష్టమైన విద్య. పొడువు లావు కొసకోనా బరువూ బలమూ వీటన్నింటికీ సమతూకాన్ని సాధించాలి. ఏది తేడా వచ్చినా విలుకాడి గురి తప్పుతుంది. వేగం మందగిస్తుంది. అంచేత శరకారుడు బహు జాగరూకుడై చేస్తాడు. అతడు ఒక బాణాన్ని తయారు చేస్తున్నపుడు పక్కనేభేరి ఢాంకారాలు చేసినా మహరాజే వచ్చి నిలిచినా అతడికి పట్టదు. అతడి కంటికి ఆ బాణం తప్ప మరేమీ కనిపించదు. చెవికి మరేమి వినిపించదు. అది పూర్తి అయ్యేవరకు లేవడు. అంతటి ఏకాగ్రతను యోగి అలవరచుకోవాలి. రోజుల తరబడి నిష్టగా కూర్చోగలగాలి. నిశ్చలంగా మనస్సును భగవంతుడి మీద నిలపడం ఎలాగో శరకారుడివల్ల తెలుసుకున్నాను. బాహ్య ప్రపంచంతో ప్రమేయం లేకుండా సమాధి స్థితి నిలుపుకోవడం నేర్చుకున్నాను.


సర్పం : సర్పం అంటే అందరూ భయపడతారు. కానీ నాకు అదీ ఒక గురువు. అది ఎక్కడ ఉంటుందో తన ఉనికిని ఎవ్వరికీ తెలియనివ్వదు గదా. ఎప్పుడూ ఒంటరిగానే సంచరిస్తు ఉంటుంది తనకో నివాసం ఏర్పరుచుకోవాలని తాపత్రయపడదు. చీమలు పెట్టిన పుట్టల్లో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తుంది. యోగ మార్గంలో ప్రయాణించే వాడికి ఈ మూడు గుణాలు తప్పనిసరి.


భ్రమరం : యదువరా! భ్రమరకీట న్యాయమని నువ్వు వినే ఉంటావు. భ్రమరం ఒక రకం కీటకాన్ని పట్టితెచ్చి తన గూటిలో పెట్టి ఝంకారం చేస్తూ దాని చుట్టు పరిభ్రమిస్తుంది. ఆ కీటకం భయోద్వేగంతో ఆ నాదాన్ని వింటూ ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపుతుంది. కొన్ని రోజులు అయ్యేసరికి ఆ కీటకం, భ్రమరనాదాన్నే కాదు, భ్రమర రూపాన్ని కూడా పొందుతుంది. మానవుడు ఇంతే. ఏ కారణంగానైతేనేమి తన మనస్సును దేనిమీద పూర్తిగా నిలుపుతాడో దాని లక్షణాలను పొందుతాడు. భగవంతుడి మీద నిలిపితే భగవత్ లక్షణాలు అలవడతాయి. ఈ జన్మలో కాకపోయినా దేహాంతంలోనైనా సారూప్యముక్తి పొందుతాడు. ఇదీ కీటకం నేర్పిన పాఠం.


సాలె పురుగు : చివరిది ఊర్లనాభం. సాలెపురుగు. తన లోంచి దారాలను వెలువరించి గూడు అల్లుతుంది. అందులో కొంచెం సేపు క్రీడిస్తుంది. ఈగల్లాంటి జంతువులను బంధించి ఆడిస్తుంది. మళ్ళీ ఆదారాలను తానే మింగేస్తుంది. తనలో లీనం చేసుకుంటుంది. సృష్టి స్థితి లయలు ఇలా జరుగుతున్నాయి. సృష్టి చెయ్యాలని సంకల్పించు కొన్నపుడు బ్రహ్మతత్వం తన మంచి త్రిగుణాత్మకాలైనా మాయా తంతువులను ఆవిష్కరిస్తుంది. త్రిగుణాత్మక జగత్తును సృష్టిస్తుంది. అందులో తాను క్రీడిస్తుంది. జీవుల్ని ఆడిస్తుంది. ఇది స్థితి విలాసం. ప్రళయకాలంలో ఆ పరబ్రహ్మమే - తాను సృష్టించిన ఈ ప్రపంచాన్ని తనలోనే లీనం చేసుకుంటుంది. ఈ పరమ రహస్యాన్ని సాలెపురుగును చూసి గ్రహించాను.

No comments:

Post a Comment