మునులంతా ఇలా అడిగే సరికి సూతుడు సంబరపడ్డాడు. వారితో ఇలా అన్నాడు. మునులారా! అందరికి వందనములు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్త మహిమలను వినాలనుకోవటం గొప్ప విశేషం. పుణ్యఫలం వల్ల తప్ప ఇటువంటి కోరిక ఉదయించదు. నన్ను కూడా కృతార్థుడిని చేస్తున్నారు. నా జన్మ కూడా చరితార్థమవుతుంది. మీరు బ్రహ్మనిష్టులు, తపోధనులు, మీసాంగత్యం లభించడం వల్ల నా జన్మ ధన్యమయ్యింది..
భగవదనుగ్రహం వల్ల గురుకటాక్షం వల్ల నా శక్తిమేరకు దత్తాత్రేయ చరిత్రను సాంగోపాంగంగా వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని సూత మహర్షి పద్మాసనం వేసుకొని కన్నులు మూసుకొని ధ్యానసమాధిలోకి జారుకున్నాడు. వాణీ చతుర్ముఖులను, గౌరీశంకరులను, లక్ష్మీవాసుదేవులను స్మరించాడు. గజాననుడ్ని స్మరించాడు. అష్టదిక్పాలకుల్ని అఖిలదేవతలని, సమస్త ముని జనవందితులని తలుచుకుని నమస్కరించాడు. యోగమార్గంలో సకలేంద్రియాలను ఏకాగ్రపరచి హృదయపద్మంలో దత్తాత్రేయ సన్నిధికి చేరుకున్నాడు.
త్రిమూర్తి స్వరూపా | త్రివర్ణించితా ! వేదవేద్యా! విశ్వవంద్యా ! విశ్వరూపా! ఒకప్పుడు గరుత్మంతునిపై వుంటావు. ఒకప్పుడు పులితోలు ధరిస్తావు. ఒకప్పుడు పీతాంబరం ధరిస్తావు. మరొకప్పుడు శ్వేతవస్త్రం ధరిస్తావు. ఒకప్పుడు సర్ప యజ్ఞోపవీతం ఒకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతం ఒక్కొక్కప్పుడు బ్రహ్మసూత్రం ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురం లక్ష్మీ వద్ద బిక్షతీసికొని సహ్యాద్రిపై సంచరిస్తావు.
మూడు యుగాలలోను అవతారాలను ధరించినవాడా ! శ్రీహరీ! నమోనమః
ఒకప్పుడు బాలుడుగా దర్శనమిస్తావు. ఒక్కొక్కసారి యువకుడిగా వృద్ధుడిగా దర్శనమిస్తావు. ఒక్కొక్కవేళ జటాధారిగా, ఒక్కొక్కసారి ముండిత శిరస్కుడిగా వుంటావు. ఒక్కో ముహూర్తాన దివ్య మాలికా దివ్యాభరణ, దివ్యవస్త్రములను ధరించి దివ్యసుందర విగ్రహుడపై కనిపిస్తావు. ఒక్కోసమయంలో మదోన్మత్త చిత్తుడుగా మదిరతో మగువతో గోష్టి జరుపుతూ వుంటావు. ఒక్కోసారి దిగంబరుడవై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు. విభూతి పులుముకుంటూ కనిపిస్తావు, అనంత నామా! దత్తప్రభూ! నీకు నమోవాకములు. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జునున్ని వేయిబాహువులుతో మహావీరుణ్ని చేసి, వేల సంవత్సరాలు భూమండలాన్ని ఏలించి, సేవలు అందుకున్న ఘనత నీదే, నీకు ప్రణామములు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశంతో మోహాన్ని తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగీశ్వరా ! దిగంబర స్వరూపంతో వున్న నిన్ను సేవించిన యదుమహారాజుకీ, అలర్క మహారాజుకీ జ్ఞానోపదేశం జేసిన సద్గురూ! నీకు నమోవాకములు. యోగవిద్యా స్వరూపా! మహామాయా ! తేజస్వులలో తేజస్సు నీవు, బుద్ధిమంతులలో బుద్ధిని నీవు, బలవంతులలో బలంనీవు, విద్యావంతులలో విద్యవు నీవు, శాంతి, క్షాంతి, దయ, ధృతి, స్మృతి, మతి అన్నీ నీవే, భూత, భవిష్యత్, వర్తమానాలు నీవే, సర్వవ్యాకరణ స్వరూపుడవు నీవే. ఈ సృష్టిలో నీవు లేనిది లేదు. నువ్వుకానిది లేదు. సర్వాత్మకా ! సర్వాంతర్యామా నీకివే నా నమస్సులు, వామనుడవై బలిని మూడడుగుల నేల దానమడిగావు. త్రివిక్రముడవై విజృంభించావు. ఆకాశంలోని సూర్యచంద్ర గోళాలు గొడుగులై, శిరోమణులై, కర్ణకుండలాలై, భుజకీర్తులై, కటిసూత్రమై అందెల మువ్వలై, నీ పాదాలకింద జారిపోయాయి. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నీ పాద పద్మాలను స్వయంగా కడిగి వేదమంత్రాలతో పూజించాడు. నీకాలిగోరు తగిలి బ్రహ్మాండం బ్రద్దలై దివ్యోదకం వాగులై ప్రవహించింది. అది భూమిపై అవతరించి గంగానదియై తనలో మునిగిన సకల జీవులకూ జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేస్తోంది. విష్ణు పాదోద్భవగా త్రిలోకాలలో పూజలు అందుకుంటోంది. సచ్చిదానంద స్వరూపా నీ అవతార లీలలు అచింత్యాలు, అప్రమేయాలు, ఆగమ్యగోచరములు. బ్రహ్మర్షులకే అంతుబట్టవు, దత్తా శరణు శరణు, ఇలా ధ్యానించిన సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందుతున్న ముఖ పద్మం. శిరస్సుపై పింగళ జటాజూటం, సూర్యచంద్రులు నేత్రాలుగా, కటియందు పీతాంబరం. ఆరుచేతులతో కరుణార్ద్ర హృదయుడు తనను స్మరించే వారి అజ్ఞానాన్ని పటాపంచలు చేసే స్వామి ప్రత్యక్షమయ్యాడు.
No comments:
Post a Comment