Sunday, 15 January 2023

శ్రీదత్త పురాణము (20)



అత్రి మునీంద్రా! నీ సంకల్పం గొప్పది. తపస్సు గొప్పది. నిరాకారము, నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించినా సాకారులమూ సగుణలమూ అయి మేము ముగ్గురము ధ్యానించిన నువ్వు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు. దివ్యతేజస్వులై జగతిలో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశదిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు. శుభం కల్గుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. 


అటుపైన బ్రహ్మాంశ వల్ల చంద్రుడు, విష్ణాంశ వల్ల దత్తుడు, శివాంశ వల్ల దూర్వాసుడు, అనసూయాత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునకు చెప్పిన దత్త జన్మవృత్తాంతం. నాయనా దీపకా దత్త జన్మ వృత్తాంతం విన్నావు గదా! ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియచెప్తాను శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు.


బ్రహ్మర్షి వారదుడు ముల్లోకాలలో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు నలుగురిని సమావేశపరచాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. అందరూ నారదునకు నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలయ్యాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని ధర్మప్రబోధం చేయమని అభ్యర్థించాడు. అన్ని ధర్మప్రభోదాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసినవి ఏమున్నాయి. అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెప్తాను. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే ఆజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి. అవి చెబుతాను వినండి అని చెప్పటం మొదలు పెట్టాడు.


ప్రహ్లాదుడు - అజగరుడు సంవాదం


లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధుసజ్జన బృందంతో బయలుదేరాడు. భూగోళం అంతా సంచరిస్తూ వింతలూ విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వతప్రాంతం చేరుకున్నారు. అక్కడ కావేరీ నదిలో స్నానసంధ్యలు గావించి నదీతీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంతదూరాన నేల మీద పడుకొని ఉన్న ఒక మహర్షిని చూచారు. ఆ మహర్షి శరీరం దుమ్ముకొట్టుకునిపోయి వుంది. కాని శరీరం నుంచి దివ్యతపః కిరణములు పెల్లుబుకుతున్నాయి. ఎవరీ మహర్షి? ఎందుకు ఇలా నేల మీద పడివున్నాడు. ఉలుకు పలుకూ లేదు. కదలిక మెదలికాలేవు. సమీపంలో ఆశ్రమంకానీ కుటీరంగాని లేదు. ఇది ఏమైనావ్రతమా? నియమమా? లేదా ఇంకేదైనా వుందా? తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు. పాదములకు శిరస్సు ఆన్చి నమస్కరించాడు. మృదువుగా ఆ పాదములను తన ఒడిలోకి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావా! అని భయం భయంగా పలకరించాడు. ఆయన మెల్ల మెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూచాడు. ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకుని ఇలా అడిగాడు.


No comments:

Post a Comment