Wednesday, 11 January 2023

శ్రీదత్త పురాణము (16)



కాశీకి వచ్చిన ఏ ప్రాణికోటినయినా తరింప చేస్తాడు విశ్వనాధుడు. ఈ భూగోళంలో కాశీని మించిన క్షేత్రం లేదు. విశ్వనాధున్ని మించిన దైవంలేదు. ముక్తిని కోరుకునే వారందరికీ కాశీ వాసము కొంగు బంగారం, మహా ప్రళయములో కూడా నశింపక నిలిచే ఏకైక అద్భుత క్షేత్రం కాశి. యమ నియమాలతో అంతరేంద్రియ బహిరింద్రియాలను బంధించి విశ్వనాధుని పాదాలను ఆశ్రయించిన వారు జీవన్ముక్తులవుతారు. కాశీలో నివశిస్తూ గంగానది, కాలభైరవుడు, దుండి విఘ్నేశ్వరుడు, దండపాణి, విశాలాక్షి, విశ్వనాధుడు, ఆరుగురిని సేవించే వారిని షడంగయోగులు అంటారు. ఎక్కడెక్కడో నివసిస్తూ యమ - నియమ - ప్రాణాయామ - ఆసన - ప్రత్యాహార - ధ్యాన - ధారణ - సమాధులను అవలంభించే, అష్టాంగ యోగులుకున్నా వీరు పుణ్యాత్ములు. కాబట్టి దీపకా మనం కాశీలోనే ఉండిపోదాం. 21 సంవత్సరములు, విసుగు విరామం లేకుండా, నిద్రహారాలకు దూరమై నాకు సేవలు చేసావు. నా అంతరంగము ఆనందమయమయ్యింది. సాక్షాత్తు విశ్వనాధుడు, నారాయణుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నా నిశ్చల గురుభక్తిని మాత్రమే కోరుకున్నావు. అలాంటి నీకు ఇవ్వదగింది చెప్పదగింది ఏమున్నది అని ఆనందంతో, సంతోషంతో పలికాడు వేదధర్ముడు.


దీపకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిలబడి చేతులు జోడించి, కన్నీరు కారుస్తూ, మహాతపస్వి, బ్రహ్మతేజస్వీ అయిన మీ అనుగ్రహానికి పాత్రుడునయ్యాను నాకు అన్నీ లభించినట్లే. అణిమాది సిద్దులు - చతుర్విధ పురుషార్ధాలు మీ సేవతోనే దొరికాయి. నాకు మీ పాద సేవకన్నా ఇవి అన్నీ ఎక్కువ అనిపించడం లేదు. నిన్ను సేవించడం తప్ప ఇహపరాలలో నేను కోరదగింది ఏమీ లేదు. నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మరిక దేని జోలికి పోవడం లేదు. ఇది సత్యం. అయినా ప్రసన్నుడపై ఉన్నావు కనుక చాలా కాలంగా నా మనస్సుతో ఉండిపోయిన కోరిక ఒకటి ఉంది. ఇంతకు ముందు ఒకసారి అడిగితే తరువాత చూద్దాం అన్నారు. అప్పటి నుండి ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కనుక దత్తాత్రేయుడి చరిత్రను మీ ముఖతః వినాలని నా కోరిక. గురుదేవ దత్తుడు ఎవరు ? ఎవరి అవతారం? ఆయన రూపం, ఆయన చరిత్ర, ఆయన మహిమ ఆయన్ను ఉపాసించవలసిన విధానం, ఉపాసించి తరించిన భక్తుల కథలు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. ఆయన దయలేనిదే యోగసిద్ధులు కలగవు అంటారు. ఆయన వర్ణాశ్రమ ధర్మాలకి అతీతుడు అంటారు. అనసూయ, అత్రి మహామునుల బిడ్డడు అంటారు. త్రిమూర్తి స్వరూపుడంటారు. చిత్ర విచిత్రమయిన లీలలు చేస్తారు అంటారు. జ్ఞానము యొక్క పరిపూర్ణ రూపమే ఆయనంటారు. దయచేసి వీటిని వివరంగా తెలియచెప్తే, అదే వరంగా ఆనందిస్తాను. అన్నాడు దీపకుడు.

No comments:

Post a Comment