Tuesday 17 January 2023

శ్రీదత్త పురాణము (22)



ప్రహ్లాదా ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు. ఎలాగంటే చెబుతాను విను. తేనెటీగలు అష్టకష్టాలుపడి తేనెను సమకూరుస్తాయి పట్టులో. లోభంతో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి పొగపెట్టి ఆ తేనేటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనె కాస్తా అపహరించుకుపోతాడు. తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు. అలాగే మానవులు ధనం కూడబెడతారు. చివరకు దాని వలనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల్ని చూచి వైరాగ్యం నేర్చుకొన్నాను. ఇంకొకటి మహాసర్పం (కొండ చిలువ) వుంది చూచావా అది కదలదు మెదలదు అందుబాటులో ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తనకై తను సొంతంగా ప్రయత్నం చేయదు. ఏ తిండీ దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళుపెట్టుకుని పడి వుంటుంది. ఎన్నాళ్ళయినా ఈ అజగరము ఇలాగే పస్తులుంటుంది. ఈ అజగరాన్ని చూచి సంతుష్టిని నేర్చుకొన్నాను. లేదని ఎవరిని అడగను. రాదని దుఃఖపడను. ఎవరు పిలిచినా ఆ అనను. ఏది ఇచ్చినా వద్దు అనను. నాకు సుఖము లేదు దుఃఖము లేదు. విలువైన పట్టుబట్టలు కట్టినా, గుడ్డపీలకలే ధరించినా, అసలు ధరించకపోయినా నా మనస్సుకి తేడా లేదు. పల్లకీ ప్రయాణాలు, కాలినడకలు నాకు ఒక్కటే. కర్పూరచందనములు రాసుకున్నా దుమ్ముధూళిలో వున్నా నాకు ఒక్కటే. హంసతూలికా తల్పాల మీద పడుకున్నా పట్టు పరుపులపై వున్నా, బండరాతిపై వున్నా, అవమానించినా, ఇచ్చినది తీపిదైనా చేదుదైనా ఒకేలాగ ఆదరిస్తాను. సగుణమైనా నిర్గుణమైనా, అధికమైనా అల్పమైనా నాకు ఒక్కటే. నాది సర్వసమదృష్టి, దీని వల్ల సుఖదుఃఖాల భేదాన్ని చిత్తవృత్తిలో అయింపజెయ్యగలిగాను. చిత్తవృత్తిని మనస్సులో, మనస్సు అహంకారములో, అహంకారాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేసాను. స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏకనిష్ఠలో వుంటున్నాను.


ప్రహ్లాదా! నీవు యోగ్యుడవు కనుక అతిగుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియజేశాను. ఇది చాలా మందికి లోక విరోధంగా శాస్త్రనిర్ధుంగా కనిపిస్తుంది. కానీ నీవు అర్ధం చేసుకోగలవు. ఆ సామర్థ్యం నీకువుంది, అని గ్రహించాను. కనుక చెప్పాను అని ముగించాడు. ఆ అజగర ప్రవృత్తిలోవున్న మహర్షి. ప్రహ్లాదుడు అమితానందంలో ఆ మహానుభావున్ని సేవించి అర్చించి పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడ్కోలు తీసుకొన్నాడు.


ధర్మరాజా ప్రహ్లాద, అజగరుల వృత్తాతం విన్నావు కదా దీనిలో అంతర్యం నీవు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు. నాయనా దీపకా! విన్నావు కదా! యోగ విద్యా విశారదుడు అయిన దత్త యోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదదర్ముడు చెప్పాడు. దీపకుడు ఆశ్చర్యంలో గురుదేవా చాలా శ్రద్ధగా విన్నాను. ఈ కధలో దత్తదేవుని ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పలేదు. మరి మీరు ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు. ఇదేమిటో నాకు అర్ధం కాలేదు. వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకున్నాడు.

No comments:

Post a Comment