Friday 6 January 2023

శ్రీదత్త పురాణము (11)



ఈ దేహము ఒక నౌకతో సమానం. సంసార సముద్రంలో నౌక పయనిస్తుంది. దీన్ని సరియైన దారిలో పెట్టి గట్టుకి చేర్పించే వాడే సద్గురువు. కనుక సద్గురువును ఆశ్రయించడం ప్రధమ కర్తవ్యం, బ్రహ్మజ్ఞానం వాదోపవాదాలతో లభించదు. యోగ సాధన కావాలి. తపోనిష్టకావాలి. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహం వుండాలి. వేదవేదాంగ పరిజ్ఞానం వుండాలి. వీటి అన్నింటికి మార్గదర్శకుడు సద్గురువు మాత్రమే.


మానవరూపంలో అవతరించిన నారాయణుడు కూడా సద్గురువును ఆశ్రయించాడు. శ్రీరాముడు వశిష్ట విశ్వామిత్రులను గురువులుగా సేవించాడు. శ్రీకృష్ణుడు, సుదాముడు మొదలగు మిత్రులతో కలసి సాందీప మహర్షి వద్ద గురుసేవలు చేసి వేద విద్యలు అభ్యసించాడు. గురుకులవాసం చేసాడు. సహాధ్యాయులతో కలసి తాను అడవికి వెళ్ళి గురువుకు కావలసిన సమిధలు, పండ్లు మొదలగునవి సేకరించి తెచ్చాడు. ఆ సమయంలో కష్టాలు అనుభవించాడు. గురువుల అనుగ్రహాన్ని పొందారు. శ్రీకృష్ణుడ్ని జగద్గురువుగా పరబ్రహ్మముగా గుర్తించిన తరువాత సహధ్యాయులు, గురువులు తమతమ భాగ్యానికి ఆనందించారు. లీలానాటక సూత్రధారి అని పొగిడారు. గురుశుశ్రూషకు సంతోషించినట్లుగా నేను ఇంక ఏ ధర్మాచరణకు సంతోషించనని అలనాడు భగవానుడే ప్రకటించాడు. కనుక నాయనా దీపకా ! గురుమహిమ వర్ణనాతీతం. గురుప్రసాదం సకలార్ధ సాధకం.


ఇంక శిష్యుని గురించి చెబుతాను విను. మంచి మాటలతో గురువు చేత శాసించబడేవాడు శిష్యుడు. భోగమోక్ష విషయంగా మంచి రెండు రకాలు. (గురువులో లేశ మాత్రమైన ఏమైనా లోపాలు వుంటే, దోషాలు, బలహీనతలు ఉంటే వాటిని పదిమందికి టముకు వేసి ప్రచారము చెయ్యకుండా కప్పివుంచేవాడు ఛాత్రుడు. నీడలాగ గురువెంటవుండి విద్యనభ్యసిస్తూ సేవిస్తూ జీవించేవాడు అంతేవాసి. ఇలాగ శిష్యులలో బేధాలు వున్నాయి) శిష్యునికి ఏది హితమని భావిస్తాడో దాన్నే గురువు బోధిస్తాడు. మారుమాట్లాడకుండా శిష్యుడు శిరసావహించాలి. ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో ముక్తిని ప్రసాదించేది, హితమంటే. ఒక్కొక్కప్పుడు గురువు చెప్పింది ఇహలోకంలో కష్టంగావచ్చు. అయినా శిష్యుడు కాదు ఆనకూడదు. వేదశాస్త్ర పురాణాలు ఏది ఎవరికి హితమో నిర్ణయించాయి. ఆ పరిజ్ఞానంతోనే గురువు శాసిస్తాడు. ఆచరణకి అనుగుణం అయిన సాధన సంపత్తిని నేర్పిస్తాడు. నిత్యానిత్యవస్తు వివేకం కలిగిస్తాడు. భోగాలు క్షణికమని గ్రహించి వైరాగ్యంతో గురుపాదాలను ఆశ్రయించడమే శిష్యుని కర్తవ్యం. తత్వజ్ఞానం ఉపదేశం పొందడానికి అర్హుడు వాడే. అనంతకాలంలో తానూ గురు పదవిని అధిష్టిస్తాడు. ఉత్తమ శిష్యులను రూపొందించి గురుఋణ విముక్తుడవుతాడు. పరంపర నిరంతరంగా అనంతంగా కొనసాగుతూనే వుంటుంది అని వేదధర్ముడు ముగించాడు. దీపకుడు ఇలా గురుశిష్య సందేహాలు తీర్చుకొని ప్రశాంత చిత్తంతో గురువుకు సాష్టాంగ నమస్కారము చేసాడు.


No comments:

Post a Comment