Saturday 14 January 2023

శ్రీదత్త పురాణము (19)

 


విదుర మైత్రేయ సంభాషణ


శౌనకాది మునులారా వింటున్నారు కదా ! మీకు కలిగిన సందేహాలే విదురుడికి వచ్చాయి. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్టుగా బ్రహ్మ కలికి చెప్తున్నాడు. ఇవి విన్నవారిని చెప్పిన వారిని ముక్తుల్ని చేసే దత్త లీలలు. ఇవి అతి పురాతన గాధలు. దీపక వేదధర్ముల సంభాషణగా చెబుతాను వినండి, అన్నాడు సూతుడు.


స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప. ఆ దంపతులకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, కొడుకుల పేర్లు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనేవి కూతుళ్ళు పేర్లు. వీరిలో ఆకూతిని ఋచి మహర్షికి, దేవహుతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు చేసారు. వీరిలో దేవహుతికి తొమ్మిది నుంది అమ్మాయిలు, ఒక అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు కపిలుడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. తొమ్మిది మంది కన్యలు సౌందర్యరాశులు. బ్రహ్మపుత్రులు తొమ్మిదిమంది వీరిని వివాహం చేసుకొన్నారు. అనసూయను అత్రి, అరుంధతిని వశిష్టుడు, శాంతిని అధర్వుడు, కళను మరీచి, శ్రద్ధను అంగీరసుడు, హవిర్భువను పులస్త్యుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు. వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు వరుసగా చంద్ర, దత్త, దుర్వాసులుగా జన్మించారు. సృష్టి, స్థితి, లయ కారకులు ఇలా జన్మించటానికి బలమైన కారణం ఉంది. చెప్తాను వినమని మైత్రేయుడు చెప్తున్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు.


విదురా! ఒకానొక కల్పారంభము నందు చతుర్ముఖుడు పునఃసృష్టి చేయబోతు అత్రి మహర్షి సహాయం అడిగాడు. అంగీకరించటం కోసం అనసూయాసహితుడై ఋక్షాద్రి పర్వతం మీద తపస్సుకి కూర్చున్నాడు. యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరచి వాయుభక్షణ చేస్తూ ఒంటికాలి మీద నిలబడి వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు, వానలు, ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. నూరు సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వ్యాపించాయి. దీన్ని గమనించిన త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహనరూఢులై అష్టదికల్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర ఋషీశ్వరులు వెంటరాగా, అత్రి ఎదుట నిలిచినారు. ఎట్టెదుట త్రిమూర్తులు సకల దేవతలు, సకల మునులు, అత్రికి కనిపించారు. వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతునిపై లక్ష్మీనారాయణులు, హంస వాహనంపై వాణీ చతుర్ముఖులు, తమ తమ దివ్యాయుధాలతో, దివ్యాభరణములతో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నారు. ఇంద్రాది దిక్పాలకులు పరివేష్టించియున్నారు. ఋషులు మునులు వేదమంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తున్నారు. అప్పుడు అత్రి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా పుత్రార్థినై, నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తున్నాను. మీరు ముగ్గురుగా దర్శనమిచ్చారు. మీకు ఇవే నా సాష్టాంగ నమస్కారములు అన్నాడు.


No comments:

Post a Comment