పతంగం : యదువల్లభా ! పతంగమంటే తెలుసుగా, మిడత. ఇది నాకు మరోరకం పాఠం చెప్పింది. దీనికి మంటలు కనబడితే చాలు ఒళ్ళు తెలియదు. మాడిపోతామని తెలిసీ నిగ్రహించుకోలేదు. ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళి మసి అయిపోతుంది. ప్రపంచంలో కనిపించే రకరకాల యోషిత్ (స్త్రీ) హిరణ్య అంబరాది ఆకర్షణలకి మానవుడు లోనై అలాగ బలైపోతున్నాడు. వట్టి తోలుతిత్తి అని తెలిసికూడా సౌందర్యాలకు మోహపడి ప్రలోభాలకు ఆశపడి జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నాడు. అహంకరించి మసి అయిపోతున్నాడు. ఈ సందేశం అందించింది కనుక మిడత నాకు మరో గురువు.
మధుకరం : మధుకరం అంటే తేనెటీగ. ఇది పాఠాలు నేర్పింది. పువ్వు పువ్వుకి వెళ్ళి పువ్వుకి నొప్పి కలగకుండా బొట్టు బొట్టుగా మకరందం గ్రహించి పొట్టనింపు కుంటుంది తేనెటీగ. యోగి కూడా ఇలాగే ఇల్లిల్లు తిరిగి ఇంటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఇంటికొక ముద్దగా ఆహారం స్వీకరించి పొట్టపోసుకోవాలి. ఏ పువ్వు దగ్గర మకరందాన్ని ఆ పువ్వు దగ్గరే గ్రోలినట్లు ఏ గుమ్మం దగ్గర ముద్దను ఆ గుమ్మం దగ్గరే ఆరగించాలి. కడుపునిండిన తక్షణం ఆ పూటకు మధూకర వృత్తిని మానుకోవాలి. మనకు రకరకాల శాస్త్రాలున్నాయి. వాటిలోని విజ్ఞాన సారాన్ని గ్రహించడంలో కూడా యోగి ఇదే మధూకర వృత్తిని ఆవలంభించాలి. తేనెటీగలు మకరందాన్ని కూడబెట్టి తేనె పట్టులు కడితే చివరికి అవి ఆ తేనెను అపహరించేవారి చేతిలో మృతి చెందుతున్నాయి. కాబట్టి యోగి ఆహారాన్ని కూడ బెట్టకూడదు. ఈ రెండు పాఠాలు నేర్చుకున్నాను మధుకరాల నుంచి.
ఏనుగు : నువ్వు రాజువి కాబట్టి, అడవిలో స్వేచ్ఛగా సంచరించే మదపుటేనుగుల్ని ఎలా బంధిస్తారో ఎరుగుదువు. ఒక పెద్ద గొయ్యి తవ్వి, దాని మీద సన్నని కర్రలు వేసి, వాటి మీద గడ్డి పరచి, దాని మీద మధ్యలో ఒక పెద్ద ఆడ ఏనుగు బొమ్మను నిలబెట్టి, మీ రాజుభటులు చుట్టు పక్కల పొదలలో దాగి, పొంచి ఉంటారు. అటువైపు వచ్చిన మదపు టేనుగు ఒంటరిగా ఒక ఆడ ఏనుగు దొరికిందని పరుగు పరుగున వచ్చి గోతిలో పడుతుంది. ఇది కాక నిజమైన ఆడ ఏనుగే దొరికి ఒక మదపుటేనుగు దాని వెంట పడితే మరికొన్ని మదపుటేనుగులు ఎగబడి, పరస్పరం పోరాడుకొని మరణిస్తాయి. పురుషుడికి స్త్రీ వ్యామోహం ఎంతటి వినాశానికి దారితీస్తుందో ఈ గజ వృత్తాంతం తెలియజేస్తోంది.
No comments:
Post a Comment