Saturday 28 January 2023

శ్రీదత్త పురాణము (33)


 సుమతి వృత్తాంతం


అనగనగా ఆర్యావర్తంలో ఒక పల్లెటూరు. ఆ వూళ్లో ఒక బ్రాహ్మణుడు. వేదవేదాంగ పారంగతుడతడు. సర్వసద్గుణ సంపన్నుడు. సర్వసామ్యుడు. శాంత స్వభావి. ధర్మపత్నీ సమేతుడై యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఆచరిస్తూ వుండేవాడు. కాని ఎంతకూ వారికి సంతానం కలుగలేదు. ఇంక మన బ్రతుకులు ఇంతే! ఈ తనువు ఇలా రాలిపోవలసిందే అని దిగులు చెందుతున్న నడి వయస్సులో వారి కలలు ఫలించి ఆమె కడుపు పండింది. పది నెలలూ మోసి పండంటి మగ బిడ్డను ప్రసవించింది. బంగారు మేనిఛాయతో దివ్యతేజస్సుతో సౌందర్య రాశి లా వున్నాడు బిడ్డడు. రోజుల గడుస్తున్న కొద్దీ బిడ్డడు అంధుడని, చెవిటివాడని, మూగవాడని ఆ తల్లితండ్రులు గుర్తించి భోరు భోరున విలపించారు. అవిటివాడైతేనేమి కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకొని గుండెలురాయి చేసుకొని బ్రతుకుతున్నారు. అల్లారుముద్దుగా బిడ్డడిని పెంచుకొంటున్నారు. సుమతి అని నామకరణం చేసి సంబరపడ్డారు. ఏనాటికైనా అతడు ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో ఎదురుచూస్తూ జీవితం గడుపుతున్నారు. కాని అది అడియాశే అయ్యింది. ఏ చైతన్యం లేని జడపదార్థంలా సుమతి ఎదుగుతున్నాడు. ఎనిమిదేళ్ళు వచ్చాయి. వయస్సుకు తగిన బుద్ధి వికసించలేదు. కాని ముఖ వర్చస్సు మాత్రం అద్భుతంగా వుండేది. ఉపనయనంజేసి కనీసం గాయత్రినైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఒడుగు జరిపించాడు. చెవిలో గాయత్రిమంత్రం జపించాడు. విన్న అలికిడి ఆ బిడ్డ ముఖంలో కన్పించలేదు. తండ్రి గాంభీర్యం అంతా సడలిపోయింది. అయ్యో నాయనా ఇంత జడుడుగా వున్నావేరా అంటూ బిడ్డని గుండెలకు హత్తుకొని భోరు భోరున విలపించాడు. బిడ్డలు లేనంతకాలం అదొక్కటే దిగులు ఇప్పుడు నిన్ను పెంచి పెద్ద చెయ్యటం అనుక్షణము మాకు అగ్ని పరీక్ష అంటూ దుఃఖించాడు. ఏ జన్మలో ఏ పాపం చేసానో ఈలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని ఇదీ ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకొని దుఃఖిస్తున్నారు.


ఓ రోజు సాయంకాలం సంధ్యను ఉపాసింపజేసి తొమ్మిదేళ్ళ సుమతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనయా ! ఉపనయనం చేసాను. వేదాధ్యయనానికి నీకు వయస్సు వచ్చింది. గురుకులంలో వేస్తాను గురుసేవ చేస్తూ చదువుకో బాగా వివేకం సంపాదించు. వయస్సు వచ్చాక వేదాధ్యయనం అయ్యాక అనువైన సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తాను. గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపి సత్పుత్రులను పొంది వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ తరువాత అనుబంధాలన్ని తెంపుకొని సన్యాసం పుచ్చుకో. ఆ దీక్షతో నీకు ముక్తి లభిస్తుంది. సుమతి అంతా శ్రద్ధగా వింటున్నాడు అతడికి అన్ని తెలుస్తున్నాయి అనే భ్రమతో పాపం ఆ పిచ్చి తండ్రి ఇంతటి బోధ చేస్తున్నాడు. సుమతి మాత్రం ఉలకలేదు, పలకలేదు అసలు అతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు. తనపుత్ర వ్యామోహానికి తానే దిగులుపడి కళ్ళల్లో నీళ్ళు కుక్కుకున్నాడు. పాపం ప్రతీ రోజు ఈ తంతు ఇలా జరుగుతూనే వుంది. ఒకనాటి మధ్యాహ్నం సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు. తనను తానే నమ్మలేనంతగా ఆశ్చర్య చకితుడై వింటున్నాడు తండ్రి.

No comments:

Post a Comment