Tuesday 10 January 2023

శ్రీదత్త పురాణము (15)



శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. నాయనా గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదరపోషణకు అవసరమయిన లౌకిక విద్యలు నేర్పిన వాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతనికంటే ఘనుడు. వేదశాస్త్రాలను బోధించేవాడు అతనికంటే ఘనుడు. వేదార్ధ బోధకుడు అధికుడు. బ్రహ్మవిద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. అతడు నాకు అభిన్నుడే. అరిషడ్వర్గాలలో చిక్కుకొని అల్లకల్లోలమవుతున్న శిష్యుని మనస్సుకు పురాణేతి శాస్త్రాల ప్రబోధంతో ఊరడింపు కలిగించి ధర్మపథంలో నడిపించే గురువే ప్రత్యక్షదైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించడానికి మించిన పురుషార్ధం లేదు. అదియే భుక్తి, ముక్తి ప్రదం. ఈ తత్వం నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు. అందువల్లనే దర్శనం ఇచ్చాను. సద్గురువులను సేవించే సచ్చిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకలశుభాలు కలుగుగాక! అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు.


కుటీరంలోని వేదధర్మునకు మెలుకువ వచ్చింది. దీపకున్ని పిలిచి నాయనా దీపకా ఎవరు వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం చెప్పాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందం, కన్నుల్లో వాత్సల్యం తళుక్కున మెరిశాయి.


ధృడ చిత్తంతో, స్థిరసంకల్పంతో దీపకుడు సేవలు జేస్తు ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్టురోగము, అంధత్వము అన్నీ ఎవరో తీసివేసినట్టుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్నికణంలా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.


నాయనా దీపకా నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలయిన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే, నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇకనుంచి గురుశుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాధుని దయవల్ల ప్రారబ్ధకర్మేకాదు మొత్తం భవసాగరాన్నే దాటాము.


No comments:

Post a Comment