Monday 2 January 2023

శ్రీదత్త పురాణము (7)



నాయనా, నీ ధ్యానానికి, నీవు చేసిన స్తోత్రానికి సంతోషించాను. ఏమి కావాలో కోరుకో మృదుమధుర స్వరంతో పలికారు. ఆనందపారవశ్యంలో మునిగిన సూతుడు నోరు మెదపలేకపోయాడు. నాయనా నీ అభీష్టం నెరవేరుతుంది ఈ శౌనకాది మునులకు నా మహిమలు వినిపించు. నీకు అంతా కరతలామలకమవుతుంది. నీవు పరమ పదానికి చేరుకుంటావు అని వరముననుగ్రహించి దత్తదేవుడు అంతర్థానం చెందాడు. క్రమక్రమంగా సూత మహర్షి ధ్యానం నుండి తేరుకుని ఆనంద భాష్పములతో నింపిన కన్నులు తుడుచుకొన్నాడు.


మునీంద్రులారా! దత్తదేవుడు అనుగ్రహించాడు. మీరడిగిన దత్త చరిత్రను వినిపిస్తాను. ఇది గురుశిష్య సంవాదంగా వుంటుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఇది సకల మనోభీష్టప్రదం. దీన్ని వినడం కన్నా మించిన తపస్సు లేదు. సకల సంపత్కరం. విద్యాప్రదాయకం, జ్ఞానప్రదం. సకలప్రదేశాలలో సమస్త కాలాలలో ఎంతటి కష్టాలు సంభవించినా దత్తుని ధ్యానించినవారికి విజయమే తప్ప అపజయమంటూ వుండదు. ఇది సకల బంధవిమోచకం. ఈ దత్త చరిత్రలో ఒక అధ్యాయాన్ని గాని లేదా ఒక భాగాన్ని గాని పఠిస్తూ దత్తుని స్మరించిన వారు దత్తుని అనుగ్రహానికి పాత్రులవుతారు.


దత్త నామాన్ని జపించినవారికి ఆ యోగీంద్రుని దయవల్ల ముక్తిని పొంది తీరుతారు. అలకించండి. సూత మహర్షీ! మరి గురుశిష్య సంవాదమన్నావు గదా అసలు గురువంటే ఎవరు ? శిష్యుడంటే ఎవరు ? వీరి లక్షణాలేమిటి ? వీరిలో శ్రేణులు ఏమైన వున్నాయా ? ఆ వివరాలు చెప్పి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అడిగారు.


మునీంద్రులారా ! మంచి ప్రశ్నలు వేశారు. మీ సందేహాలు తీరాలంటే ఒక పురాణ గాధ తెలుపుతాను దీనికి బ్రహ్మ - కలి సంవాదమని పేరు. ముందుగా అది వినిపిస్తాను, వినండి అని సూతుడు ప్రారంభించాడు.


No comments:

Post a Comment