Sunday 29 January 2023

శ్రీదత్త పురాణము (34)


తండ్రీ మీరంటున్న వేదాలు శాస్త్రాలు కళలు కావ్యాలు ఇవి అన్నీ నేను ఎన్నో సార్లు అభ్యసించాను. ఇవి ఏమీ నాకు కొత్తకాదు. గ్రుడ్డి, మూగ, చెవుడు, జడుడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఇందులో ఆశ్చర్యం ఏమిలేదు. నా కథ చెబుతాను విను. ఇంతవరకూ నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను. అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మలు లాగా కదులుతున్నాయి. ప్రతిజన్మలో జరిగిన ప్రతీ విషయం నాకు జ్ఞాపకం ఉంది. ఎందరెందరు తల్లిదండ్రులు ఎందరెందరు బంధుమిత్రులు ఎందరెందరు భార్యాపుత్రులు లెక్క పెట్టి చెప్పడం ఎవ్వరి తరమూకాదు. ఎన్నెన్ని సుఖాలు ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు. తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది. నరజన్మలేనా మృగజన్మలేదా పశుపక్షి, కీటకాదిక్రిముల జన్మలేనా అన్నీ నేను అనుభవించాను. ప్రతి పుట్టుకా ఒక నరకం. మలమూత్ర పంకిలమైన జననీ జకర నివాసం. శైశవ, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలలో సుఖదుఃఖాల వెలుగునీడలు స్వయం కృతాలు, పరాకృతాలు, అన్ని చాలా రుచి చూసాను. భృత్యజన్మల్లో కృంగిపోయాను. రాజజన్మల్లో విర్రవీగాను, పిరికిపందగా పారిపోయాను. మహాశూరుడిగా విజృంభించాను. దరిద్ర, ధనిక, చోర, కిరాతక, జూదరిజన్మలు ఎన్నో ఎత్తి వంచించాను, వంచింపబడ్డాను. త్యాగిగా కీర్తింపబడ్డాను. లోభిగా నిందింపబడ్డాను. సర్వాంగ సౌందర్యాలు, అంగవైకల్యాలు అన్నీ గుర్తువున్నాయి. అవన్నీ కలిగించిన నిర్వేదంతో ఈనాడు ఇలా జడపదార్థంలా మారిపోయి మీ ఇంటిలో జన్మించాను. పూర్వజన్మప్మృతి లేకపోవడం నిజంగా మానవుడివరం, లేకపోతే నాలాగే అందరూ జడపదార్థముల వలె ఉండేవారు. నిర్వేదంలో మునిగిపోయేవారు. సరే ఆ జన్మలూ, ఆ కష్టాలు, ఆ వైరాగ్యాలు, వాటి మాటకేం గాని తండ్రీ నీవు చెబుతున్న వేదోక్త కర్మలపట్ల నాకు సదభిప్రాయం లేదు. అవి నాకు రుచింపవు. యజ్ఞయాగాదులు చెయ్యడం స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం సంపాదించుకున్న పుణ్యం ఖర్చుకాగానే మళ్ళీ భూలోకంలో గర్భవాస నరకం అనుభవించడం ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తడం మళ్ళీ దుష్కర్మలు సత్కర్మలూ నరకయాతనలు సుఖదుఃఖాలు అనుభవించడం మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం ఇంతేగదా జనన మరణ చక్రంలోబడి కొట్టు మిట్టాడటం. దీనికి విసుగూ విరామం లేదా ? నువ్వంటునట్లు కర్మమార్గం ఇంతకన్నా ఉత్తమ పదాన్ని అందిస్తుందా? ఇంతకన్నా ఉన్నతపదం ఉంది అని అసలు నీవు గుర్తించావా? జననమరణాలకు అతీతమైన శాశ్వత ఆనందధామం కదా మనం చేరుకోవలసింది దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం. నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం. ఒక్కటే జ్ఞానమార్గం, సర్వ సంగపరిత్యాగము, రాగద్వేషాది ద్వందాలకు లొంగని ప్రవృత్తి అలవరచుకోవడమే జ్ఞానమంటే. ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు. కర్మబంధం ఉండదు. జన్మరాహిత్యమే చివరఫలం. తండ్రీ ఇది నువ్వు తెలుసుకోవాలి.

No comments:

Post a Comment