Saturday, 21 January 2023

శ్రీదత్త పురాణము (26)



కపోతం : ఒక అడవిలో ఒక చెట్టుమీద గూడు కట్టుకుని కపోత దంపతులు సుఖంగా జీవిస్తున్నాయి. అనుక్షణము కలిసిమెలసి తిరుగుతూ ఆహారం సంపాదించుకుంటూ ఆనందంగా అన్యోన్యంగా వుంటూ కులాసాగా తమ జీవితాన్ని గడుపుతున్నాయి. ఇంతలో కొన్నాళ్ళకి ఆడ పావురం గర్భం ధరించి గ్రుడ్లు పెట్టింది. వాటిని ఎంతో ప్రేమతో పొదిగింది. అన్నీ పిల్లలయినాయి వాటి పెంపకంలో కపోత దంపతులు క్షణం తీరికలేకుండా ఆనందం అనుభవిస్తున్నాయి. ఎక్కడెక్కడికో వెళ్ళి రుచికరమైన ఆహారము సేకరించి తెచ్చి ముక్కులతో అందించి సంబరపడుతున్నాయి. పిల్లల కేరింతలు చూచి మురిసిపోతున్నాయి. ఒకరోజున కపోత దంపతులు అడవికి మేతకు వెళ్ళిన సమయంలో ఒక బోయవాడు వచ్చి ఆ చెట్లు క్రింద నూకలు జల్లి వలపన్ని దగ్గరలో వున్న పొదలో దాగి కూర్చున్నాడు. పాపం అప్పుడప్పుడే రెక్కలు వస్తున్న పిల్ల పావురాళ్ళు ఆ కొమ్మా ఈ కొమ్మమీద దూకుతూ చెట్టు క్రింద ఆ వలలో చిక్కుకున్నాయి. అదే సమయానికి కపోత దంపతులు వచ్చి ఆ సంఘటన చూచి భోరున విలపించాయి. కన్న తీపిని వదులుకోలేక ఆడ పావురం పిల్లల్ని రక్షించుకుందామని వచ్చి తామ వలలో చిక్కుకుంది. భార్యాపిల్లలు వలలో చిక్కుకుని విలపిస్తుంటే మగపావురం భరించలేక వీళ్ళులేకపోయాక నా జీవితమెందుకు అని తానుకూడా వలలోకి చిక్కుకుంది. పొద నుండి వచ్చిన బోయవాడు రెండు రోజులకి సరిపోయే ఆహారం దొరికిందని సంబరపడుతూ అన్నింటిని వలలో గట్టిగా బంధించి భుజాన వేసుకొని చక్కగా పోయాడు. యదు మహారాజా! కుటుంబీకుడైన వాడికి వుండే అనురాగాలు, మోహాలు, ఎలా బంధనాలు అవుతాయో, ఆత్మ వినాశమునకు ఎలా దారితీస్తాయో, ఈ కపోత దంపతుల ద్వారా నేర్చుకున్నాను. ముక్తి ద్వారం లాంటి మానవ జన్మను పొంది గృహలంపటుడు అయ్యేవాడు మూర్ఖుడుకాక మరి ఏమిటి అతి స్నేహం పనికిరాదని నేర్చుకున్నాను కపోతాల ద్వారా.


అజగరము : అజగరమంటే మహాసర్పం (కొండచిలువ) కదలదూ మెదలదు. ఆహారం కోసమైనా ఏ ప్రయత్నమూ చెయ్యదు. అప్రయత్నంగా లభిస్తే తింటుంది. లేకపోతే పస్తులుంటుంది. ఇలాగే మనమూను. దైవికంగా ప్రాప్తమయ్యే సుఖ దుఃఖాలను అనుభవించడమే తప్ప వాటికోసం కర్మాచరణ చెయ్యడం మానుకోవాలి. నిద్రహారాలను పరిత్యజించి ఆత్మనిష్టను అలవరచుకోవాలి. ఇది నేర్పింది కాబట్టి అజగరం నాకు మరో గురువు.


సముద్రం : తనలాగ గాంభీర్యం అలవరచుకోమని ప్రభోదించింది సముద్రం. దానిలోతు ఎవడికైనా తెలుసా? దాన్ని దాటగలవాడు ఉన్నాడా? ఎన్ని నదులు వచ్చి చేరినా ఉప్పొంగుతుందా? సూర్య కిరణాలకు ఎంత నీరు ఆవిరి అవుతూన్న దిగులుపడి కృశిస్తోందా? తనలో ఏవస్తువులూ ఏ జంతువులూ ఎన్నెన్ని ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో తెలియనిస్తోందా? దీనికి గట్టులూ అవధులు ఉన్నాయా? ఆత్మనిష్టుడు ఈ గాంభీర్యాన్ని అలవరచుకోవాలి.


No comments:

Post a Comment