Monday 30 January 2023

శ్రీదత్త పురాణము (35)



ఆశ్చర్యచకితుడై కళ్ళు అప్పగించి తండ్రి రవ్వంత తేరుకున్నాడు. ఇంతటి జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కల్గుతున్నా చిన్నవాడి వైరాగ్య మాటలు అతన్ని కలవరపరచాయి. జడుడు అనుకున్నవాడు నేడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్యగోచరంగా ఉంది. నాయనా సుమతి ఏమిటి నీ మాటలు, ఒక్కనిమిషంలో నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? పూర్వజన్మల స్మృతి ఎలా కలిగింది? ఏదైనా శాపకారణంగా నీవు మా ఇంట జన్మించావా ? నన్ను మీ అమ్మను మళ్ళీ దుఃఖ సాగరంలో ముంచి వెళ్ళిపోతావా? అసలు నీ జన్మ రహస్యం ఏమిటి ? చెప్పు అని ఆందోళనతో అడిగాడు. వేదవేదాంగాలు అభ్యసించిన తండ్రి పుత్రవ్యామోహంతో అలా రోదిస్తుంటే సుమతికి నవ్వు వచ్చింది. ఇలా అన్నాడు. తండ్రీ నీకు పుత్రుడుగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించాను. ఆ ఇంటికి వచ్చిపోయే సాధు సజ్జనులతో సాంగత్యం కలిగింది. వేదాంగ చర్చలు అనేకం చేసాను. ముక్తిమార్గాలు తెలుసుకున్నాను. జ్ఞానం ఉదయించింది. అంతరంగం నిండా వెలుగునింపుకొంది. ఏకాంత వాసంలో చాలాకాలం గడిపాను. నా నియమనిష్టలు పరిపక్వదశకు వచ్చే సమయంలో, బ్రహ్మసాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాద వశాత్తు మరణించాను. యోగశక్తి కారణంగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. నేను చేసిన జ్ఞాన దానాల ఫలితంగా పదివేల పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నాముందు నిలచాయి. నిర్వేదంతో, సంగతీత, ద్వంద్వాతీత స్థితి కలిగింది. దానినే ఈ జన్మతోను కొనసాగించదలచాను. ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని విడిచి నువ్వు చెప్తున్న కర్మమార్గం అవలంభించలేను. ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా అందరూ చేరుకొనేది గమ్యమే. అదే అందరి లక్ష్యము. నా మార్గంలో నేను గమ్యం చేరుకుంటాను. అందువలననే ఈ జడ స్థితి. కాలం వృధా చేసుకోకూడదు కదా ! ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికెరుక, కనుక ముక్తిలభించే వరకు అనుక్షణము ఆత్మానుభవపరుడై తదేక దీక్షలో గడపడం నా ధృడసంకల్పం. నీ ఇంట పుట్టాను కనుక పితృఋణం తీర్చుకోవడం నా ధర్మం. జ్ఞాన దానం చేసి ఋణ విముక్తి పొందుతాను. తండ్రీ నీకేమైనా సందేహాలుంటే అడుగు అన్నాడు.


కిందటి క్షణం వరకు జడుడుగా ఉండి ఇప్పుడు ఇంతటి జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రికంటికి మహాయోగీశ్వరుడులా కనిపించాడు. హిమాలయ శిఖరంలా గోచరించాడు. సుమతికి తాను పెట్టిన పేరు సార్ధకమయ్యిందని సంబరపడ్డాడు. కుమారా, నాయనా ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యము ఏమిటి చెప్పు. నేను ఈ జన్మ పరంపరలలో ఇలా మునిగి తేలవలసిందేనా ! దీనికి విముక్తి ఏమిటి ? దయచేసి తెలియచెప్పు. కన్నకొడుకుతో మాట్లాడుతున్నానన్న చనువు, మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు తండ్రి స్వరంలో వినిపించాయి. సుమతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు.


తండ్రీ నా మాటలమీద నీకు నిజంగా గురి కుదిరింది కదా ! అయితే చెబుతాను విను. ఈ సంసారము నిస్సారమని ముందు నువ్వు గ్రహించు. ఆ తరువాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమం వదలి వానప్రస్థం స్వీకరించి అమ్మతో సహా అడువులకు వెళ్లి భగవధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవరుచుకో. ఆ పైన సన్యాసం స్వీకరించు.   

No comments:

Post a Comment