Thursday 26 January 2023

శ్రీదత్త పురాణము (31)


 

ఇలా ఇరవై నలుగురు గురువుల నుంచి ఆత్మోపదేశాలు పొందాను. ఇవేకాదు నా శరీరమే నాకొక పరమ గురువు. ఇది నశ్వరమని మనకు తెలుసు. దీనిలోపల జుగుప్సాకరమైన పదార్థాలు ఉన్నాయని తెలుసు. అయినా దీని మీద అందరికీ వల్లమాలిన మమకారం. కళ్ళ ఎదుట ఎందరి శరీరాలు రాలిపోతున్నా, తన శరీరం మాత్రం శాశ్వతమునుకుంటాడు ప్రతివాడూ, దీన్ని పోషించడానికి, దీని సంరక్షణకు ఎన్నెన్ని అగచాట్లు పడతాడో, ఎంత లేసి ఘోరాలు చేస్తాడో, పోనీలే అనుకుంటే ఈ శరీరానికి కృతజ్ఞత ఉందా? అలువంతయినా లేదు. చెప్పాపెట్టకుండా ఎప్పుడో హఠాత్తుగా రాలిపోతుంది. దీన్ని ఆశ్రయించుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సవతుల్లా పోరాడుతూ జీవులను సుఖభ్రాంతిలో ముంచి కడపటికి నరకంలోకి త్రోసేస్తున్నాయి. విచిత్రమేమిటంటే ఇదే మోక్షానికి సాధన మవ్వడం. వివేకంతో వైరాగ్యంతో ఇంద్రియాలను అదుపు చేసుకొని దీని అశాశ్వతత్వాన్ని గుర్తించి మెలగగలిగిన వాడు ధన్యుడు. నిజానికి మానవ శరీరం ఎన్నో జన్మలకు గానీ, దొరకదు. అన్ని పురుషార్థాలకీ ఇదే సాధనం. ఇది మృత్యుగుహ్వరంలో ప్రవేశించక ముందే మేల్కొని మోక్షపురుషార్ధ సాధనకు మనం ప్రయత్నం చెయ్యాలి. ఇందరు గురువులు, ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన ప్రబోధాలను గుర్తించి అహంకార మమకారాలకు లొంగకుండా ఆత్మనిష్ఠలో సంచరిస్తున్నాను. యదురాజా! ఏ ఒక్క గురువు పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేడు. పలువురు పలువిధాలుగా ఉపదేశిస్తుంటారు. బ్రహ్మతత్వం ఏకైకమే అయినా ఋషులలో అభిప్రాయ భేదాలు మాత్రం అనేకం. దీనిని నిరసించక అన్నింటినీ గ్రహించి ఆకళింపు చేసుకోవడం మన కర్తవ్యం.


అవధూత చెప్పిన ఈ మహా విషయాలను యదు మహారాజు ఆకళింపు చేసుకున్నాడు. కొత్త వెలుగు ఏదో తనకు కనిపించినట్టు అయ్యింది. సంతృప్తి చెందాడు. అవధూతను సత్కరించి పునఃపునః దండప్రణామాలు ఆచరించి సెలవు తీసుకొని తన రాజధానికి చేరుకున్నాడు. ఉద్ధవా! మన వంశంలో పూర్వీకుడైన ఈ యదు మహారాజు, అవధూత చేసిన జ్ఞానభోధను ఆచరణలో పెట్టి సర్వసంగ విముక్తుడూ సర్వప్రాణి సమచిత్తుడూ అయ్యి ధర్మబద్ధంగా పరిపాలన సాగించి అపునర్భవమైన ముక్తిని పొందాడు అంటూ శ్రీకృష్ణుడు తన ప్రసంగం ముగించాడు. శ్రద్ధగా విన్న ఉద్ధవుడు ఆత్మతత్వాన్ని ఆకళింపు చేసుకొని సంతృప్తి చెందాడు.


నైమిశారణ్యవాసులారా! ఋషీశ్వరులారా వేదధర్ముడు తన శిష్యుడైన దీపకుడుకి చెప్పిన దత్తావధూత మహిము ఇది అంటూ బ్రహ్మ కలిపురుషుడుకి గురు మహిమను చెప్పి కనువిప్పు కలిగించాడు అని చెప్పి సూత మహర్షి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.


ప్రథమ భాగం సమాప్తం

No comments:

Post a Comment