నాయనా దీపకా, దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు బడుతున్నావు. మొట్ట మొదటే చెప్పాను కదా దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తువుంటాడని అదీ గాక బ్రహ్మనారదునికి చెప్పిన విషయం గుర్తుచేసుకో తన పాద పద్మాలను సేవించిన యదు, కార్తవీర్య, ప్రహ్లాద, అలర్కులను దత్తదేవుడు ఆత్మ విద్య భోదించాడని బ్రహ్మదేవుడు చెప్ప లేదూ! వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తెలుస్తుంది. ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతం ఇప్పుడు చెపుతాను ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెప్పుతున్నాడు.
అవధూత యదుమహారాజు సంవాదం
నాయనా దీపకా ఒకప్పుడు ఉద్దవుడు శ్రీ కృష్ణభగవానునికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వం భోదించమని అడిగాడు. అప్పుడు వాసుదేవుడు ఉద్దవునితో ఇలా అన్నాడు. ఉద్ధవా ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా? ఎవరి మటుకు వారు తెలుసుకోవాలి. మానవులు మంచి చెడ్డ విచక్షణా జ్ఞానం కలవారు. తమని తామే ఉద్ధరించుకోవాలి. ఆత్మకు గురువు ఆత్మయే. అందుకనే సాంఖ్యులు మానవశరీరంలోనే సర్వజ్ఞుడైన పరమాత్మను దర్శిస్తూవుంటారు. సృష్టిలో ఆపాద, ద్విపాద, త్రిపాద, చతుష్పాద, బహుపాద జీవరాసులు వున్నాయి. వీటిలో పురుష శరీరం అంటేనే నాకిష్టం. ఎందుకంటే ఆ శరీరంలోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటున్నారు. అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి. ఇందులో నివసించే మనో, బుద్ధి, చిత్త, అహంకారములు జడ పదార్ధములు. వాటిని ప్రకాశింపజేసి చైతన్యం తెస్తున్న శక్తి సంపన్నుడు ఒకడెవడో వుండాలి. అందుచేత వెతుకుదాం అని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటున్నారు. బుద్ధ్యాధులు సాధనములు కనుక వీటికి సాధ్యుడు వుండాలి అని అనుమాన ప్రమాణంతో నన్ను అన్వేషిస్తున్నారు. కనుక మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టం. ఇందులో వున్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే కొంతవరకు అవధూత - యదువు సంవాదం గురించి చెబుతాను ఆలకించు. యదువు తెలుసుకదా యయాతిపుత్రుడు మహాతపశ్శాలి, ధర్మజ్ఞుడు. ఒకరోజు ఒక అవధూతను దర్శించి నమస్కరించి ఇలా అడిగాడు.
మహానుభావా ! నీవు సుందరుడవు, కవీశ్వరుడవు, సత్యసంధుడవు, మహాజ్ఞానివి, అయినా జడుడులా ఉన్మత్తుడిగా పంచరిస్తున్నావు ఎందుకని ? యింద్రియతృప్తి కోసం నీవు ఏ పనీ చేయటంలేదు. ఈ వివేకం నీకు ఎలా కలిగింది ? పండితుడవయ్యుండి బాలుడిగా ప్రవర్తిస్తున్నావు ఎందుకని ? సాధారణంగా మానవులు పడే ఏ తాపత్రయమూ నువ్వు పడ్తున్నట్లుగాలేదు. సిరిసంపదలు వృద్ధి చేసుకోవాలని నీవు రవ్వంతయినా ప్రయత్నం చేయటంలేదు. ఇది చాలా వింతగా వుంది. అందరికన్నా భిన్నంగా వుంది నీ తీరు. గంగానదిలో మునిగిన ఏనుగులా ఎక్కడో వుంటున్నావు. ఒంటరిగా గడుపుతున్నావు. ఎవరి జోలికి పోవటంలేదు. ఏ స్పర్శలు నీకు అంటటం లేదు. అయినా ఎప్పుడూ ఆనందంగా కన్పిస్తున్నావు. నీకిది ఎలా సాధ్యమయ్యింది ? దయజేసి ఇది తెలియజెప్పి పుణ్యం కట్టుకో అని ప్రాధేయపడ్డాడు.
No comments:
Post a Comment