Tuesday 3 January 2023

శ్రీదత్త పురాణము (8)



కలి - బ్రహ్మ సంవాదం


పద్మ కల్పానికి ఆరంభంలో నారాయణుని నాభి నుండి కమలము ఉద్భవించి అందుండి బ్రహ్మ ఉద్భవించి పద్మాసనంలో కూర్చుని సకల చరాచర జగత్తును సృష్టించనారంభించినాడు. భూలోకంలో మానవులను సృష్టించాడు. వారికి వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరచి వాటిని అమలు చేయడానికి మనువులను సృష్టించాడు. కాలాన్ని యుగాలుగా ఏర్పరచాడు. కృత, త్రేతా, ద్వాపర, కలియుగాలను యుగాధిపతులుగా మనువులను ఏర్పరచాడు. ధర్మ రక్షణ భారాన్ని మనువులకు అప్పగించాడు. మొదటి ముగ్గురూ తమతమ విధి నిర్వహణకోసం బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి బయలుదేరారు. పిశాచ రూపుడు, కలహ శీలుడు అయిన కలి పురుషుడు మాత్రం దిగంబర రూపంలో గంతులువేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ఒక చేత్తో మర్మాంగాన్ని, మరొక చేత్తో నాలుకను పట్టుకొని నిలబడ్డాడు.


విధాతా! సకల పాపాలకు ధర్మాలకు వినాశకుడిగా నన్ను రూపొందించావు. భూలోకంలో శత్రువులు నాకు చాలామంది వున్నారు. పుణ్యకార్యాలు ఆచరించే వారంతా శత్రువులే. శివనామం, హరినామం, గంగాస్నానం, దానం, సత్సంగం, పుణ్యక్షేత్ర సందర్శనం ఇవి ఆచరించే వారంతా నాకు శత్రువులే. వీటిని ఆచరించటం నాకు నచ్చటం లేదు. నాకు ఇలాంటి పాపకార్యాలు విధించావేమిటి ? అంటూ కలిపురుషుడు విలపించాడు.


అప్పుడు బ్రహ్మ నాయనా! కలిపురుషా! నీ విధులు నీవు నిర్వర్తించు. ఇందులో బాధపడవలసింది ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్న నీ శత్రువర్గాన్ని నీవు ఏమీ చేయలేవు. వ్యసనాలకు, అరిషడ్ వర్గాలకు, డాంభికులకు, ఆసత్య, అనాచారాలకు దాసులైన వారే నీ శిష్యులు. వారిని ఆక్రమించి శిక్షించడం నీ విధి. నీ బాధల నుండి తప్పించుకోవాలంటే జనులకు రెండు మార్గాలు వున్నాయి. ఒకటి పురాణ పఠనం, శ్రవణం. రెండు గురుసేవ. ఇవి చేసే వారిని నీవు హింసించలేవు. వారి దరిదాపులకు కూడా నీవు వెళ్ళలేవు. పురాణాలు వినిపించేవారు గురువులే! గురు సేవ చేసుకునే వారికి నీ బాధవుండదు. పూర్వ జన్మ సుకృతం వల్లనే ఉత్తమ గురువు లభ్యమవుతాడు. గురువు బోధిస్తే తప్ప శాస్త్ర పరిజ్ఞానం ఏర్పడదు. శాస్త్రజ్ఞానం ఉంటేగానీ ధర్మాధర్మ వివేకం అబ్బదు. అది అబ్బకపోతే తత్వం తెలియదు. తత్వం తెలియకపోతే ఆత్మజ్ఞానం కలుగదు. ఆత్మజ్ఞానం కలుగకపోతే ముక్తి లభించదు. కావున ముక్తి మూలం గురువే పురాకృత పుణ్యం లేని వారికి గురువు లభించడు. వారంతా నీకు చిక్కుతారు. ఇందులో మప్పు విచారపడవలసింది ఏమిలేదు. నీ ధర్మం నీవు ఆచరించు అని బ్రహ్మ కలిపురుషుడిని బుజ్జగించాడు.  


No comments:

Post a Comment