నాయనా దత్తాత్రేయస్వామి వారు పరస్పర విరుద్ధరూపాలలో తిరుగుతుంటారు. భక్తులను కఠినంగా పరీక్షిస్తుంటారు. ఒక్కోసారి జటామండలధారిగా మరుక్షణంలో ముండిత శిరస్కుడుగా, యోగిగా, భోగిగా, దిగంబరుడుగా, శ్వేతాంబరుడుగా, పీతాంబరుడిగా, కనిపిస్తారు. ఒక్కోసారి మహా విద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా, మదమత్తుడిగా, కనిపిస్తారు. ఒకోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు. ఒకోసారి మహైశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తారు. నిజమైన రూపం ఏది అనేది ఎవ్వరికీ తెలియదు. అంతుపట్టని రహస్యం, హర, హరి, హిరణ్యగర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతాడు. గంగలో స్నానం చేసి, కొల్హాపురిలో బిక్షచేసి, సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు.
త్రికరణశుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు. స్మతృగామి అనేది ఈ స్వామికి గొప్ప బిరుదు. అంగన్యాస, కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానమున్నది. దీనినే దత్త కవచము అంటారు. భక్తుడు దత్తనామాలను జపిస్తూ, శిరస్సు మొదలుకొని, కాలివేళ్ళ కొసల వరకు, ఒక్కొక్క అంగాన్ని తాకాలి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలలో, మనోబుద్ధి చిత్త అహంకారాలలో దత్తనామాలను విక్షేపించాలి. దత్త కవచధారులకు ఏ రంగములోను ఆపజయముండదు. శతృభయాలు, దుష్టపీడలు, గ్రహబాధలు, భూతప్రేత పిశాచాల హింసలు దరిదాపులకు కూడా రావు. భక్త రక్షణలో ఇది వజ్రకవచం. దీనితోపాటు దత్త మంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే చెప్పదగింది ఏమిలేదు. దత్తమంత్ర దీక్షను పొందిన వారికి చతుర్విధ పురుషార్ధాలు లభించినట్లే. ఇంతగా జపించలేనివారు దత్త నామాన్ని రోజుకు కనీసం 10 సార్లయినా స్మరించాలి.
స్మరించే ముందు దత్త స్వామిని హృదయంలో నిలుపుకోవాలి. పీతాంబరధారి, భస్మోద్ధూళిత దేవుడు, సువర్ణవర్ణుడు, విద్యుత్కాంతి కల్గిన జడలు కలవాడుగా దత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి.
నాయనా దీపకా దత్తస్వామి అవతారగాధ చాలా మనోహరంగా ఉంటుంది. పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడట. అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు. అత్రిపుత్రుడు కనుక, ఆత్రేయుడు. అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంతతానుగా దత్తమయ్యాడు. కనుకనే దత్తాత్రేయుడయ్యాడు. తన భక్తులైన యదు, కార్తవీర్యార్జున, ప్రహ్లాద, అలర్కుడు, వీరికి బ్రహ్మఙ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేసాడు. ఈ దత్త లీలలన్నీ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. ఆ వివరాలు చెప్తాను శ్రద్ధగా విను.
No comments:
Post a Comment