శౌనకాది మునులారా! బ్రహ్మదేవుడు కలికి చెప్పిన గురుశిష్యుల సంభాషణ ఇది. గురు శిష్యుల లక్షణాలు గుణగణాలు తెలిసాయి కదా! గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు అని గురుభక్తి గురుసేవయే భుక్తిముక్తిదాయకం అని పురాణములు బోధిస్తున్నాయి. అటువంటి గురు దత్తాత్రేయుడి చరిత్రను వినాలని అనుకోవటం మీ పూర్వపుణ్య విశేషం. చెబుతాను వినండి అని సూత మహర్షి అన్నాడు.
అప్పుడు మునులంతా ఇలా అన్నారు. మహర్షీ గురు శిష్యుల లక్షణాలు అద్భుతంగా చెప్పావు, ధన్యవాదాలు. దత్త చరిత్ర వినాలనే కుతూహలం మమ్మల్ని తొందర పెడుతుంది. కానీ దీపక వేదధర్ముల సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది. దీపకుడు తన దీక్షను నెరవేర్చుకొన్నాడా ? జీవితాంతం బ్రహ్మచారిగానే వుండి గురుసేవలో తరించాడా? కష్టాలు ఎదురైనాయా ? చివరికి అతనికి దక్కిన గురుఫలం ఎలాంటిది ? గురువు ఎలా అనుగ్రహించాడు ? ఇవన్నీ మాకున్న సందేహాలు అని అడిగారు.
అప్పుడు సూతమహర్షి వారి వంక చిరునవ్వుతో చూస్తూ ఇలా చెప్పాడు. గురుశుశ్రూష తప్ప వేరొక ధ్యాసలేని దీపకుడ్ని ఒకరోజు వేద ధర్ముడు దగ్గరకి పిలచి నాయనా నీ సేవలకు ఆనందంగా వుంది. నాకున్న శిష్యులందరిలో అగ్రగణ్యుడవు నీవే. నాకొక అవసరం వుంది ముందు విను తరువాత సమాధానం చెబుదువు గాని తొందరలేదు అని నాయనా, దీపకా, నేను అనుభవించవలసిన కొన్ని కర్మలు ఇంకా మిగిలిపోయాయి. అవి పూర్వజన్మ సంచితములు. తపస్సులతో కొంతరవకు నశింపజేసుకొన్నాను. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. అవి తప్పనిసరిగా అనుభవించి నశింపజేసుకోవడమే ఉత్తమ మార్గం. అందుకని కాశికి వెడదామని అనుకొంటున్నాను. ఆ పుణ్యక్షేత్రంలో అయితే మహా మహా పాతకములను కూడా స్వల్ప ప్రాయశ్చిత్తములతో నశింపజేసుకోవచ్చు. పుణ్య ఫలాల మాదిరిగానే పాప ఫలాలు ఎక్కడికిపోవు. కర్త - అనుభవించి తీరవలసిందే. దేవతలకైనా ఇది తప్పదు. కనుక నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. కాశీలో నేను పాప ఫలాలు అనుభవిస్తున్న వేళ విసుక్కోకుండా, కనుక్కోకుండా, సేవలు చేసే శిష్యుడు కావాలి. నా మనస్సుకి నీవు కనిపించావు నేను నిర్ణయిస్తే నీవు కాదనవని తెలుసు. కాని ఇది ఒకటి రెండు రోజులు కాదు ధృఢదీక్ష వుండాలి. అంకిత భావం వుండాలి. అన్యచింతలు దగ్గరికి రానివ్వని నిగ్రహం వుండాలి. అదీగాక నీవు ఇప్పుడు గృహస్థాశ్రమానికి యోగ్యమైన వయస్సులో వున్నావు విద్యలన్నీ పూర్తి చేసుకున్నావు నీ మనస్సు ఏమంటుందో తొందరలేదు ఆలోచించుకొని చెప్పు అన్నాడు.
అప్పుడు దీపకుడు గురుదేవా ! మీరింతగా చెప్పాలా నేను మీ సేవకే అంకితమైనాను. మీ సేవలో జీవించడమే నా ధ్యేయం, నా దీక్ష, మనస్సులో కూడా నన్ను శంకించకండి. కాశిలో వుండి మీ సేవ చేసుకొనే భాగ్యం ప్రసాదించండి అన్నాడు.
No comments:
Post a Comment