Monday 23 January 2023

శ్రీదత్త పురాణము (28)

 


మధుహారి : మధుహారి అంటే తేనెను సేకరించేవారు. వేల సంఖ్యలో తేనె టీగలు నెలల తరబడి శ్రమపడి తేనె పట్టులో తేనెను కూడబెడితే మధుహారి వచ్చి పొగపెట్టి ఆ తేనె టీగలను సంహరించి క్షణంలో తేనెను అపహరించి పట్టుకుపోతాడు. లుబ్ధులై ఎవరు ఏ ధనాన్ని కూడ బెట్టినా, బలవంతులు ఎవరో వచ్చి దాన్ని కాజేస్తారు. కనుక తన అవసరానికి మించి సంపదలను కూడబెట్టుకోవడం చాలా హానికరమని గ్రహించాను. అలాగే గృహస్తుల కన్నా ముందు యాచకులు వెళ్ళి వారి వంటకాలను అడిగి ఆరగించడం తగదనీ గ్రహించాను.


హరిణం : హరిణమంటే లేడి. అది వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకుంటుంది. యతీశ్వరుడు కూడా అలాగే సంగీతాది లలిత కళలకు సమ్మోహితుడయితే ధ్యాన నియమనిష్టల నుంచి పరిభ్రష్టుడవుతాడు. ఋష్యశృంగుడి కథ ఎరుగుదువు కదా! విలాసవతుల నృత్య గీతాలకు వివశుడై సంసారంలో చిక్కుకొన్నాడు.

మీనం : నాకు మరొక గురువు మీనం. అంటే చేప ఎరకి ఆశపడి గాలానికి తగులుకుంటుంది. జిహ్యచాపల్యం ప్రాణాలు తీస్తుంది. యోగులకు కూడా జిహ్యేంద్రియాన్ని జయించడం కష్టసాధ్యం. దీన్ని జయిస్తే అన్నింటినీ జయించినట్టే. ఈ రహస్యం నేర్చుకున్నాను చేపను చూసి.


పింగళ : పింగళ ఒక వేశ్య. విదేహ పట్టణంలో నివసిస్తుండేది. చాలా అందగత్తె. ధనవంతులకు గేలం వెయ్యడం వారిని బికారులను చెయ్యడం దాని వృత్తి. ఒకనాటి సాయంకాలం అద్భుతంగా సింగారించుకొని తన భవంతి గుమ్మంలో నిలబడింది. వీధినపోయే ధనవంతుల్ని పసికట్టి ఆకర్షిద్దామని దాని ఆశ. గంటలు గడుస్తున్నాయి. గానీ ఎవడూ ఈమెకేసి కన్నెత్తి అయినా చూడడం లేదు. అయినా ఆశగా అలాగే నిలబడింది. చీకట్లు ముసురుకున్నాయి. గుడ్డివెన్నెల కాసింది. పింగళ ఒక సారి లోపలికి వెళ్ళి సింగారానికి సవరింపులు చేసుకుని మళ్ళివచ్చి నిలబడింది. వీధిలో జనసంచారం తగ్గింది. అర్ధరాత్రివేళగదా అప్పుడైనా విటులు వస్తారని ఆశగా అలాగే నిలబడింది. ఫలించలేదు. కాళ్ళు లాగాయి. విసుగు వచ్చింది. ఇక నిలబడలేక లోపలికి వెళ్ళి హంస తూలికా తల్పం మీద నడుం వాల్చింది. అంతలో వాకిట గుమ్మం దగ్గర ఏదో అలికిడి అయితే విటుడెవడో వచ్చాడనుకొని చివాలున లేచి చరాలున గుమ్మంలో నిలిచింది. ఎవ్వరూ లేరు. అంతా గుడ్డి వెన్నెల చెట్లనీడలు, సగం నిద్రలో ఉలిక్కిపడిన పులుగు కూనల కువకువలు. అంతటా నిశ్శబ్దం- ఒక్కసారిగా సింగళ హృదయంలో తుఫాను చెలరేగింది. నేనేమిటి? నేను చేస్తున్న పని ఏమిటి? నా జన్మకు ప్రయోజనం ఏమిటి? ఎంతమందిని బికారుల్ని చేశాను? ఎంత కూడ బెట్టాను? చచ్చిపోయేటపుడు ఇందులో ఎంత కూడా పట్టుకు వెడతాను? ఎక్కడికి వెడతాను? నరకానికే అక్కడ నేను అనుభవించే యాతన లేమిటి? నేను చస్తే ఒక్కడైనా అయ్యోపాపం అంటాడా? ఆలోచనలు ఉవ్వెత్తున చెలరేగాయి. సమాధానాలూ దొరికాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. తన వృత్తి మీద జుగుప్స కలిగింది. వైరాగ్యభానుడు ఉదయించాడు. అయ్యో! ఎన్ని సంవత్సరాల జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నాను. ఒక్కనాడైనా హరి నామస్మరణ చెయ్యలేదే. అనంత సుఖప్రదుడూ మనశ్శాంతి కారకుడూ అయిన భగవంతుణ్ని, చేరువలో ఉన్న పెన్నిధానాన్ని విస్మరించి ఎవడెవడో సుఖాలు ఇస్తాడని నిధులు పంచుతాడనీ ఎండమావుల వెంట పరుగులు తీశాను. ఛీ! ఇక ఆ జీవితానికి స్వస్తి-ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ క్షణం నుంచి శేష జీవితాన్ని హరినామస్మరణతో గడిపింది. ధర్మ కార్యాలు ఆచరించింది. తీర్ధయాత్రలు చేసింది. పాప పంకిలాలను ప్రక్షాళన చేసుకుని మనశ్శాంతితో తనువు చాలించింది. యదుపతీ! ఈవిడ జీవితం నాకు నేర్చిన పాఠమేమిటో గ్రహించావా? ఆశ అనేది దుఃఖ ప్రదమనీ వైరాగ్యం సుఖ ప్రదమనీను.


No comments:

Post a Comment