బ్రహ్మదేవా! గురువు అంత గొప్పవాడా? గురు శబ్దానికి అర్ధం ఏమిటి ? గురువంటే ఎవరు ? ఎలాంటివాడు.
గురువు ? ఎవరికి గురువు ? గురు స్వరూపం తెలియపరచి నన్ను కృతార్ధుణ్ని చేయమని కలిపురుషుడు అభ్యర్ధించాడు. కలిపురుషా ! నీ సందేహం తీర్చడం నా ధర్మం. గురు శబ్దంలో ఉకారం అచ్చు. అది ద్విరుక్తమయ్యింది. గకార రేఫలు రెండూ హల్లులు. వీటిలో గకారం సర్వసిద్ధి ప్రదం. రకారం సర్వ పాపనాశకం. ఉకారం అవ్యక్త అచింత్య విష్ణు తత్వానికి వాచకం. అందుకే రెండు హల్లులకు ప్రాణమయ్యింది.
అచ్చునే ప్రాణమంటారు. దాని వల్లనే హల్లులు ప్రాణులు అవుతున్నాయి. ఇంకా వీటిలో వర్ణాదిదేవతలు వున్నారు.
గకారానికి గణపతి, రకారానికి అగ్ని, ఉకారానికి విష్ణువు అధి దేవతలు. ఈ రకంగా గురు శబ్దమే మంత్రంతో సమానం. ఇది చతుర్విధ పురుషార్ధాలకు సాధనం. తల్లి, తండ్రి, పరాత్పరుడూ గురువే. శిష్యుడు మీద శివుడికి కోపం వస్తే గురువు రక్షించగలడు. గురువుకే కోసం వస్తే శివుడు కూడా వాణ్ని ఏమీ చేయలేదు. గురువే పరతత్వం. అందుకే గురువును ఆశ్రయించాలి అంటున్నాయి వేదాలు, పురాణాలు. శ్రీమన్నారాయణుడే ప్రసన్నుడైనా గురుభక్తినే కోరుకుంటారు ఉత్తమ వైష్ణవ భక్తులు. గురువు ప్రసన్నుడైతే నారాయణుడు ప్రసన్నం అయినట్లే. సకల పుణ్యక్షేత్రాలను, తీర్థాలను దర్శించిన ఫలం దక్కుతుంది. సకల వ్రతాలు, తపస్సు చేసిన పుణ్యఫలం దక్కుతుంది. శాస్త్ర పరిజ్ఞానం ధర్మాధర్మ వివేకం, భక్తి జ్ఞానవైరాగ్యాలు, సదాచారం సమస్తము గురుసేవ చేతనే లభిస్తుంది. నాయనా కలీ! ఒక్క మాటలో చెప్పాలంటే గురుమహిమ వర్ణనాతీతం. అంతట కలి, విధాతా! ఇక్కడ నాడొక ధర్మసందేహం ఉన్నది. మానవ మాత్రుడైన గురువుకు ఇంతటి శక్తి ఎలా వచ్చింది. సకల దేవతా స్వరూపుడంటున్నావు, సర్వజ్ఞుడంటున్నావు ఇదెలా సాధ్యం అయింది? అని అడిగాడు.
కలీ! మంచి సందేహం వచ్చింది. చెపుతున్నాను విను, గురువు లేకపోతే ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానం వుంటుందా? శాస్త్రాలు తెలియకపోతే ధర్మ స్వరూపం తెలుస్తుందా? ఇది తెలియనివాడు నీ బారి నుండి తప్పించుకోగలడా? కీలకం అంతా ఇక్కడే వుంది.
గురుమహిమను తెలియజెప్పే పురాణ గాధ ఉంది. చెబుతాను. ఆలకించు. నీ సందేహాలు అన్నీ తీరుతాయి అన్నాడు బ్రహ్మ.
No comments:
Post a Comment