అగ్ని : అగ్ని మహాతేజశ్వి, సర్వభక్షకుడు అయినా సర్వదా పవిత్రుడు. అందరికీ ఆరాధ్యుడు. ఈ లక్షణాలు యోగి అగ్ని నుండి గ్రహించాలి. అగ్ని ఏ వస్తువును ఆశ్రయిస్తాడో ఆ రూపంలో మాత్రమే వుంటాడు. పరమాత్మ కూడా ఏ జీవిలో వుంటే ఆ రూపం ధరిస్తాడని గ్రహించాను అగ్ని నుండి. అగ్ని వున్నప్పటికీ ఒక్కోసారి కంటికి కనిపించదు. అలాగ జీవికి జన్మాది వికారాలు నిత్యమే అయినా ఒక్కొక్కప్పుడు కాలగతిలో మరుగున పడివుంటాయి.
ఇవీ నాకు పంచభూతాలు ఉపదేశించిన బోధ, నేను గ్రహించిన తత్వం.
చంద్రుడు : చంద్రుడు వృద్ధి, క్షయములకు లోనవుతూవుంటాడు. అవి అతడి కళలే గాని అతని పూర్ణరూపంగాదు. అలాగే షడ్భావ వికారములు శరీరమునకే కాని ఆత్మకు కాదని తెలుసుకున్నాను చంద్రునివల్ల.
సూర్యుడు : సూర్యుడు ఒక్కడే అయినా అనేక జలాశయాల్లో కనిపించి అనేకానేక ప్రతిబింబములుగా కన్పిస్తాడు. అంటే ఆత్మ ఒక్కటే అయినా అనేకంగా కన్పిస్తుంది అని గ్రహించాను. అంతేకాక సూర్యుడు శుభ్ర, అశుభ్ర భేదాలు లేకుండా సర్వత్రా విరాజిల్లుతునే వుంటాడు. అన్నిరకాల జలాలను స్వీకరిస్తాడు. పరిశుభ్రపరిచి వర్షములుగా కురిపిస్తూ వుంటాడు. కానీ అతడి చేతులకి మలినం అంటదు. సూర్యుడు నిత్య పరిశుభ్రుడు. యోగి కూడా ఇలాగే ఇంద్రియాదులతో సుఖదుఃఖాదులన్నింటిని సమదృష్టితో చూడాలని వాటికి అతీతుడుగా నిత్యశుద్ధుడుగా వుండాలని తెలుసుకున్నాను సూర్యుడు నుండి.
యయాతినందనా! తక్కిన పదిహేడుమంది గురించి చెబుతాను తెలుసుకో. ముందుగా కపోతం గురించి విను.
No comments:
Post a Comment