Tuesday 24 January 2023

శ్రీదత్త పురాణము (29)



కురరం : మరొక గురువు కురరం. అంటే లకుముకి పిట్ట. అది ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కున కరుచుకుని గూటికి ఎగురుతోంది. మరొక పెద్దపులుగు చూసింది. లకుముకుని వెంటాడింది. ఈ చిన్ని పిట్టకు భయం వేసింది. మాంసం ముక్కను వదిలేసింది. పెద్దపులుగు దాన్ని తన్నుకుపోయింది. బ్రతుకు జీవుడా అనుకుంది లకుముకి. రాజా! గ్రహించావా? మరొకరికి కన్నుకుట్టే వస్తువు మనదగ్గర ఉంటే అది మన ప్రాణాలకే ముప్పు, బలహీనుడు ఈ రహస్యం తెలుసుకోవాలి. లేదంటే ఆపదల్లో పడతాడు.


పసిబాలుడు : పసిబాలుడు నా పరమ గురువు. చీకూ చింత లేకుండా కేరింతలు కొడతాడు. తన ఆటలేవో తనవి. తన ఆనందమేమో తనది. మిగతా ప్రపంచం ఏమైపోయినా అతడికి పట్టదు. అవధూత కూడా ఇలాగే ఉండాలి. ఈ సృష్టిలో నిశ్చింతగా ఆనందించేది వీరిద్దరే. ఒకడు అమాయకుడు, మరొకడు మాయాతీతుడు.


కన్య : కన్యకా వృత్తాతం ఏమి నేర్పిందో చెబుతాను విను, అనగనగా ఒక వూరు. ఆ వూళ్ళో ఒక కన్యక. రూప యౌవన వతి. గుణవతి. శీలవతి. పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. చూస్తున్నారు. వెడుతున్నారు. ఇంకా ఏదీ ముడిపడలేదు. ఒక రోజున తల్లిదండ్రులు ఏదో పని మీద గ్రామాంతరం వెళ్ళిన సమయాన పొరుగూరు నుంచి మగపెళ్ళివారు వచ్చారు పిల్లను చూసుకుందామని. వరుడూ అతడి తల్లిదండ్రులూ, బంధుమిత్రులూ ఒక అయిదారు మంది వచ్చారు. కన్యకామణి స్వయంగా స్వాగతం పలికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తడి ఒత్తుకోవడానికి తువ్వాళ్ళు ఇచ్చి నడవలో చాపలు పరచి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టింది. తాగడానికి మంచి నీళ్ళు అందించింది. ఇప్పుడే వస్తాను ఉండండి అంటూ వంట గదిలోకి వెళ్ళింది. ఏదైనా ఫలహారం చేసి పెడదామని డబ్బాలు వెదికి వరిపిండి తీసి పళ్లెంలో పోసి రెండు చేతులతోను తడిపి ముద్ద చేస్తోంది. ఆ కదలికలకి గాజులు గలగలలాడాయి. ఏదో చేస్తున్నామని అతిధులు గ్రహిస్తారని ఒక్కొక్క చేతికి రెండేసి గాజులే ఉంచి మిగతావి తీసేసింది. అవి కూడా ఒక దానికి ఒకటి తగిలి రొద చేస్తున్నాయి. అప్పుడు ఒక్కొక్క గాజునే ఉంచుకొని గబగబా పిండి కలిపి జంతికలు వండిపెట్టింది. మగ పెళ్ళివారు అమ్మాయి పని మంతురాలని గ్రహించి సంబరపడి మరొక రోజు వచ్చి మీ నాన్న గారితో మాట్లాడతాములే అని చెప్పి బయలుదేరారు. తరువాత ఏమయ్యిందో వదిలి వేద్దాము. ఇప్పటికి ఈ ముక్కచాలు. యదువీరా! ఏమైనా గ్రహించగలిగావా? పది మంది ఒక చోట చేరితే గాజులలాగ గలగలలాడటమూ కలహించుకోవడమే తప్ప పరమార్ధ విచికిత్స ఉండదు. ఇద్దరు ఉన్నా వృధా సంభాషణలతో కాలయాపన జరుగుతుందే కాని ఒరిగేదేమీ ఉండదు. అంచేత నిరాటంకంగా ధ్యానం సాగాలంటే అంతర్ దృష్టి విస్తరించాలంటే సాధకుడు ఒంటరిగానే ఉండాలి. ఇదీ గాజుల గలగలలు నాకు నేర్పిన పాఠం. 


No comments:

Post a Comment