Thursday 5 January 2023

శ్రీదత్త పురాణము (10)

 


దీప వృత్తాంతం


అంగీరసుడు అనే బ్రహర్షి వుండేవాడు. ఆయన గోదావరీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకొనేవాడు. ఆయన ఆశ్రమం ఎప్పుడూ మునులతో శిష్యులతో కళకళలాడుతూ వుండేది. ఎక్కడెక్కడ నుండో మునులు, ఋషులు వచ్చి అంగీరసుడ్ని అడిగి తమతమ సందేహాలు తీర్చుకుంటూ వుండేవారు. యోగరహస్యాలు తెలుసుకుంటూ వుండే వారు. ఎందరు వచ్చినా ఆ ఆశ్రమంలో కందమూల ఫలాలు కాని, పుష్పాలకు గాని లోటు ఉండేదికాదు. అలా వచ్చిన వారిలో వేదధర్ముడు అనే ముని ఒకరు, ఆయన పైలుని కుమారుడు. శిష్యబృందంతో వచ్చి ఆంగీరసుని వనంలోనే తపస్సు చేసుకుంటూవున్నాడు. ఆయన శిష్యులలో దీపకుడు అనే శిష్యుడు అగ్రగణ్యుడు. బుద్ధిలోను, గుణంలోనూ, వివయంలోనూ, విధేయతలలోనూ, నిష్టలోన చెప్పుకోదగిన వ్యక్తి, వేద వేదాంగాలు అభ్యసించాడు. అయినా గృహస్థాశ్రమం స్వీకరించలేదు. బ్రహ్మచారిగానే జీవితాంతం వుండి గురుసేవ చేస్తూ తరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. గురువుగారు సరేనని అంగీకరించాడు. దీపకుడు పరమానందభరితుడై గురుసేవలో కాలం గడుపుతున్నాడు. ఒకరోజు దీపకుడు వేదధర్మునికి సేవ చేస్తూ ఇలా అన్నాడు. గురుదేవా ! నాదొక చిన్న సందేహం. అడగమంటే అడుగుతాను అన్నాడు. వేదధర్ముడు అడగమన్నాడు. అప్పుడు దీపకుడు గురుదేవుని పాదాలు నొక్కుతూ గురుశిష్య పదాలకు సమగ్రంగా అర్ధం వివరించండి అన్నాడు. అప్పుడు వేదధర్ముడు ఆనందంతో ఇలా చెప్పుతున్నాడు.


నాయనా లోకంలో హితం చెప్పిన వాడల్లా గురువే ! ఒక్క అక్షరం పాటి జ్ఞానాన్ని బోధించేవాడు గురువే !


జీవితంలో మనిషికి చాలా మంది గురువులు వుంటారు. వారిలో ఉత్తములు ఉంటారు. మొట్టమొదట కన్నతల్లి గురువు. ఆ తరువాత, తండ్రి మరొక గురువు, ఇంటికి పెద్దవాడు గురువే. మేనమామ, పిల్లనిచ్చిన అత్తమామలు, తండ్రి యొక్క తల్లిదండ్రులు, తల్లి యొక్క తల్లిదండ్రులు వీరంతా మన్చి చెప్తారు కనుక గురువులే ! ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశం చేస్తాడు కనుక కన్నతండ్రి గురువే ! వేదాలు శాస్త్రాలు అతడే నేర్పితే అతని గురుత్వం రెట్టింపు అవుతుంది. వేరొకరెవరైనా వేదాలు శాస్త్రాలు నేర్పితే అతడు ఉత్తమ గురువు. సంగీతం, శిల్ప, లౌకిక విద్యలు నేర్పిన వారెవరైనా గురువులుగానే పరిగణింపబడతారు. సంసార సాగరాన్ని తరించడానికి జనన మరణాల చక్రం నుండి బయటపడటానికి ఏకైక మార్గం అయిన బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించేవాడు పరమగురువు. అతడే పరతత్వం ! అతడే త్రిమూర్తి స్వరూపం ! అతడే సకల దేవతా స్వరూపం ! మానవ రూపంలో వున్నాడని అనుమానించవలసిన అవసరం లేదు. బ్రహ్మజ్ఞానంతో నిన్ను బ్రహ్మమును చేసే పరబ్రహ్మనుతడే. వీరు కాక రకరకాల దేవతా ఉపాసనలు, మంత్రాలు, వ్రతాలు, ఉపదేశించే గురువులు చాలామంది వుంటారు. దీక్షలు ఇచ్చే గురువులు వుంటారు. ఆచార్యులు వుంటారు. గురికుదుర్చుకొని శ్రద్ధతో గురుసేవ చెయ్యాలి. ఇహ పరాలలో శ్రేయస్సుని కలిగించేవాడు గురువు. సద్గురువును ఆశ్రయిస్తే సమకూడనిది అంటూ లేదు.


No comments:

Post a Comment